కౌముదిలో నా కవిత : అమ్మా.."నిను వినా.."
అమ్మ కోసం నేను రాసిన కవిత ఈ నెల కౌముదిలో అచ్చయింది..:).
అది అందరి కోసం మళ్లీ ఇక్కడ..(కొన్ని మార్పులతో..)
నిను వినా....
ఎవ్వరూ లేని సాగర తీరంలో పరుచుకున్న వెన్నెల్లాగా ఏకాంతంలో నీ జ్ఞాపకాలు చుట్టుముడతాయి..
వర్తమానం ఒంటరిదై ముడుచుకుంటుంటే..ఆలోచనలు పసిపిల్లలల్లే బాల్యంలోకి పరుగులెడతాయి..
పందిరి పై దాకా పాకిన సన్నజాజి తీగల్లాగే..నా జీవితంలోని ప్రతి ఘడియా నీ ప్రేమతో ముడిపడి ఉంది
కాలం కౌగిట్లో కరిగిన ఒక్కొక్క క్షణం ..అమ్మా!! ..నీ అనురాగ ధారలలోనే తడిసి ముద్దయిపోయింది..!
ఆటల్లో పడి సమయం తెలీకుండా నేనాడి అలసిపోతుంటే
వందల సార్లు నువ్వు విసుగు లేకుండా నన్ను పిలుస్తుంటే..
అయిష్టంగానే ఇంటికొస్తాను, నీరసంతో నీ ఒడిలో సోలిపోతాను
నువ్వు లేపి ముద్దలు పెట్టే దాకా, మూతి తుడిచి మళ్లీ నిద్ర పుచ్చే దాకా!
అనుకోకుండా ఏ అర్ధ రాత్రో చదవాలని నేను లేచి కూర్చుంటే
అలసటతో గాఢనిద్రలోకి జారుకున్న నీకెలా మెలకువొస్తుందో
అంత మగతలోనూ నన్నుత్సాహ పరిచేందుకు ఓపికెలా వస్తుందో
ఆనాడిచ్చిన తేనీటి వెచ్చదనం ఈనాటికీ హృదయాన్ని తాకుతోందిదిగో..
క్షేమానికై ఆరాటపడడాన్ని ఆంక్షల చట్రంలో బంధించే యత్నమని భ్రమించి
రెక్కలొచ్చాయన్న ధైర్యంతో రివ్వున ఎగిరిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి
నన్ను వెనక్కి లాగి పొదివి పట్టుకున్నది నీకున్న ప్రేమే తప్ప పంతం కాదని
ఇన్నేళ్ళ తర్వాత అర్థమయ్యాక నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుందెందుకో!
నా జీవితం పూరించలేని సమస్యలా మారి
ప్రతీ ఉదయం భయంతో మొదలైనప్పుడు
వరుస ఓటములతో ప్రపంచం మసకబారి
ఒంటరితనంతో దహించుకుపోతునప్పుడు...
ముడుచుకున్న పెదవుల మీద నవ్వులు పూయించిందీ
నా ఉహల చిత్రాన్ని మళ్లీ ఆశల వర్ణాలతో నింపింది నువ్వే!
అపజయాలను దాటుకుని గెలవగల సత్తా ఉందని నమ్మిందీ
నేను విజేతలా అందరి ముందు వస్తానని విశ్వసించింది నువ్వే !
ఉద్యోగమంటూ ఒంటరిగా ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడినప్పుడు
వెన్ను తడుతూ నువ్వు వీడ్కోలు చెప్పడానికి వచ్చినప్పుడు
నీ చెంపలను ముద్దాడిన నా పెదవుల నంటిన ఉప్పదనం ......
నీ కన్నీళ్లను దాచిందేమో కాని గుండెల్లోని ప్రేమను కాదు !!
నీ అంత ప్రేమను జీవితాంతం పంచే మనిషి కోసం
రేయింబవళ్ళు పరితపించి నాకో సరిజోడు వెదికినా
నీకు మాత్రం తెలీదా అమ్మా....
నిన్ను మించగల్గిన వాళ్ళు సృష్టిలో ఇంకెవ్వరూ లేరని...ఉండరని....!
No comments:
Post a Comment