Monday, January 07, 2013

రామాయణం

రాముడు ఏమి తపస్సు చేశాడు?

      రాముడు తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది? రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?

     కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు. నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత " ధర్మాచరణం " .  ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి. ఇందులోని విచిత్రమేమిటంటే  ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.

తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక "అస్త్ర శస్త్రాలను" కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.  అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.


ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః  |అని ఉపనిషద్వాక్యం.


 ఋజు వర్తనము,  సత్య వాక్పరిపాలనము , వేదశాస్త్రముల అధ్యనము, శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట, అంతరింద్రియ నిగ్రహము, దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే. 



    దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు.  మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.

  కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు. అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు.  కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".  ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు. 

ఈ అభినవ తాటకను వధిస్తే మీరు సిద్ధులౌతారు


   "మూర్తీ భవించిన ధర్మ మూర్తి, ఆదర్శ పురుషుడు అని ఆస్తికులందరూ కొనియాడే ఆరాముడు తన రాక్షససంహారంలో మొదటగా తాటక అనే రాక్షసిని చంపాడు కదా! మరి అదేమి ధర్మం?అబలను చంపుట అదేమి న్యాయం? అతడేమి దేముడయా?" అని అనేకులు ప్రశ్నిస్తుంటారు. ఇది అందరికీ అర్థం కాని ధర్మ సూక్ష్మం కనుక ఈప్రశ్న వేయడానికి ఆస్తిక - నాస్తిక బేధం అవసరం లేదు. ఎవరైనా వేయవచ్చు. అది సమంజసమైనదే కూడా! అటువంటి సందేహం వచ్చింది అంటే రామాయణం గురించి కొంత యోచన చేస్తున్నట్లే.  ఈ ప్రశ్నకు వాల్మీకి రామాయణం ద్వారా నాకు తెలిసినంత వరకు నా సమాధానాన్ని( నా అభిప్రాయాన్ని ) తెలిపే ప్రయత్నం చేస్తాను.వాల్మీకి రామాయణమే మనకు ప్రమాణము. మిగతా వన్నీ దానినుండి ఉద్భవించినవే. వీటిలో అనేక స్వీయ కల్పనలు ఉన్నాయి. కనుక వాల్మీక మహర్షి ప్రణీత రామాయణమును తెలుసుకోనిదే నిజం తేట తెల్లమవదు.కనుక నేను ఇతః పూర్వం టపా ( ఆదిలోనే అబలను చంపుట అదేమి న్యాయం? - 1 ) లో తెలిపిన తాటక వధ ఘట్టాన్ని ఓ సారి చదివి ఈ చర్చను కొనసాగించగలరు.


  ఇప్పుడు మనం పై ప్రశ్నపై ఆలోచిద్దాము. రాముడు తాటకను ఎందుకు చంపాడు? ౧. తండ్రి ఆదేశం ( విశ్వామిత్రుని ఆదేశాలను శిరసావహించమని ), ౨. గురువు సూచన, ౩. గోవులకు, బ్రాహ్మణులకు హితము చేయడం కోసం, ౪. ఆదేశ ప్రజల సౌఖ్యము కొరకు( లోకకళ్యాణార్థము ) నేను తాటకను చంపుతాను అని రాముడు చెప్పాడు.

దశరథుడు విశ్వామిత్రునితో రాముని పంపుతూ  అతడు ఏమి చెపితే అది శిరసావహించి నిర్వహించ మని చెప్పి పంపాడు. అలాగే గురువైన విశ్వామిత్రుడు ధర్మాధర్మాలు వివరంగా తెలిపి తాటకను చంపడం రాజుగా నీధర్మం అనితెలిపాడు. కనుక రాముడు నేను తాటకను చంపుతాను అన్నాడు. అన్నాడు కానీ వెంటనే చంపక కొంత అవకాశమిచ్చాడు. ఆమె అబల అగుట చేత నాకు ఆమెను చంపుటకు మనస్కరించడం లేదు. కనుక ఆమె కాళ్లు, చేతులు నరికి వేసినచో ఆమె గమనశక్తి తగ్గి వెనుతిరుగుతుంది అని లక్ష్మణునితో చెప్పి ఆవిధంగా చేస్తాడు. కానీ ఆమె మాయావి అగుటచే కంటికి కనిపించకుండా అనేక రూపాలలో వీరిపై రాళ్ల వర్షం కురిపిస్తుంది. సంధ్యవేళ వస్తె ఆమె శక్తి పెరిగుతుంది, ఆమెను చంపటం మరింత కష్టమౌతుంది అని గురువైన వశ్వామిత్రుడు సూచించడంతో ఇక తప్పక ఆమెను వధిస్తాడు. ఇన్ని కారణాల వలన కూడా మనకు అది అధర్మంగా తోస్తే మరో కోణంలో చూద్దాం. అది కూడా రామాయణము ( చరిత్రగా కాక )  కేవలము ఒక ‘కావ్యముగా’  మాత్రమే పోల్చుకుంటూ చూద్దాం.


తాటక ఎవరు? ఒక స్త్రీ.
స్త్రీని ఎందుకు చంపకూడదు? స్త్రీ సహజంగా శారీరక రీత్యా పురుషుని కంటే శక్తి తక్కువ కలిగినది కనుక.   ( అలాగే బ్రాహ్మణులు పురుషులైనప్పటికీ ఆధ్యాత్మిక విద్యలలో నిమగ్నులై మరొకరిని బాధపెట్టడానికి, యుద్ధము చేయడానికి విముఖులై ఉంటారు కనుక - గోవులు సహజముగా సాధు ప్రవర్తన కలిగినవి కనుక వీరిద్దరినీ చంపుటకూడా మహా పాపములుగా మన ఋషులు తెలిపారు. ) అదే అర్థంలో "అబల" అంటారు. బలము లేనిది కనుక ఆమెను చంపుట తగదు.


మరి తాటక అబలా? ఇక్కడే విచిత్రంగా చెప్పారు వాల్మీకి. "తాటక జన్మరీత్యా అబల, కానీ పుట్టుకతోనే వేయి ఏనుగుల బలము కలిగినది" అన్నారు. అంటే ఆమె అబల మరియు సబల అన్న మాట. అది ఎలా కుదురుతుంది? బలము లేనిది, అదే సమయములో బలము కలిగినదీ కూడా ఎలా అవుతుంది? ( ఇక్కడే వాల్మీకి మహర్షి రచనా వైచిత్రి అబ్బురపరుస్తుంది. మహర్షులకు మన పై ఎంత ప్రేమ ఉందో ఋజువు అవుతుంది. ఈ మర్మం తెలిసిన కొద్దీ మన కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతుంది. పూర్వమే (పూర్వపు టపాలో- చూడండి ) నేను తెలిపినట్లు మహర్షులు పురాణాలలో చాలా సందర్భాలను పూర్తిగా వివరింపక కొంత చూచాయగా చెప్పడం జరుగుతుంది. అది మన మీద కల అవ్యాజమైన ప్రేమ వలన తప్ప మరొకటి కాదు. వారి సూచనను గమనించి ఆవాక్యాలను తవ్వుకుంటూ వెళ్తె మనకు కొన్ని సత్యాలు తెలుస్తాయి. అవి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనింప చేస్తాయి. )
అలా బలము ఉన్నది అయితే ఆమె అబల కాదు సబల అనవలసినదే కదా! ఆవిధంగా చూస్తె రాముడు అబలను చంపాడు అన్నది సరికాదు. అతడు బలహీను రాలిని చంపలేదు. వేయి ఏనుగుల బలము కలిగిన రాక్షసిని చంపాడు. కనుక ఈ అపవాదు సరికాదు.

సరే అదీ వదిలేద్దాం కాసేపు తాటక అబల అనికూడా అనుకుందాము. కానీ బలవంతు రాలు కూడా. మామూలు బలం కాదు వేయి ఏనుగుల బలం ఆమెది. పుట్టినప్పుడే ఆమెకు అంత బలం ఉంది. పైగా తాటక మాయావి. అనేక రూపాలను పొందగలదు. అనేక వస్తువులను సృష్టించ గలదు. ఇవన్నీ మహర్షి ఎందుకు చెప్పినట్టు? ఏదో సూచనగా మనకు తెలుపుతున్నట్లు ఉంది. అది ఏమై ఉంటుంది? ఈశ్వరుని సృష్టిలో ఇటువంటి తత్వం గలిగినది మరొకటి ఉన్నదా? మీకు తోచిందా అదేమిటో? తెలిసినట్లైతే చిక్కుముడి వీడినట్లే!

సరే నేనే చెప్తాను. తాటకవలెనే ఒకే సమయమున బలము లేనిది మరియు బలము కలిగినది అయిన ఒక విచిత్ర సృష్టి భగవంతుని లీలలలో కలదు. దానిపేరే "మనస్సు". ఈ మనస్సు కు కల బలము ఇంతా అంతా అని చెప్పుటకు వీలు కాదు.  అలాగే దీనికి బలము లేని స్థితి కూడా కలదు. మనలోని చాలామందికి ఈ రెండు స్థితులు అనుభవమే. ఏ స్థితి ఎప్పుడు కలుగుతుందో చెప్పుటకు ఎంతో తపస్సు అవసరం. ఆ తపస్సు చేసిన వారే జీవితంలో ఉన్నత స్థితిని పొందుతున్నారు. మనసు మాయావి. అది ఎప్పుడు ఏ వికృత రూపం దాలుస్తుందో, ఎప్పుడు ప్రసన్నమై ఆనందాన్ని చిందిస్తుందో కేవలం సాధన వలన మాత్రమే తెలుసుకొన గలం. ఈ మర్మం తెలిసిన నాడు మీరు మాంత్రికులౌతారు.

మనసు విచ్చలవిడిగా సంచరింప చేసిననాడు, అది ఆశ్రయించ రాని వాటిని ఆశ్రయించిన నాడు వికృత రూపం దాలుస్తుంది. మీరు వ్యతిరేకించ నంత కాలం దాని వికృత రూపం తెలియదు. ఒక్కసారి మీకు బాగా అలవాటైన ( సిగరెట్ - మందు - స్త్రీ - టీవీ - జూదం )  మీకు నిజంగా చెరుపు చేస్తున్నాయనిపించిన దేనినైనా ఆపడానికి ప్రయత్నించండి. మనసు మొండికేస్తే గదమాయించి చూడండి. అప్పుడు తెలుస్తుంది దాని రాక్షసత్వం ఎంత కర్కశమైనదో. అగస్త్య మహాముని అలా తనను అదుపు చేశాడనే తాటక ( అతడిని ఏమీ చేయలేక ) అతడు సంచరించిన అరణ్యమును ఆక్రమించి అందు నివసించే ప్రజలను నానా బాధలను పెట్టింది. చివరకు ఎవ్వరినీ ఆ అరణ్యమున అడుగుపెట్టకుండా చేసింది. అలాగే మనసు కూడా మనం సంచరించిన భావాలను, అనుభూతులను ఆక్రమిస్తుంది. క్రమక్రమంగా మనకు ఆనంద కరమైన అనుభవం అంటూ ఏదీ మిగలకుండా చేస్తుంది. మొత్తం తానే అయి వికృత రూపం దాల్చి మనల్ని పిచ్చి వారిగా చేస్తుంది. ఇటువంటి వారు మనకు ఈ ఆధునిక జీవనంలో అనేకులు ఎదురవుతారు. రేపు మనమే ఆ మనసు దాడికి గురికామనేమిటి నమ్మకం?

క్షమించండి మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కేవలం ఒక ఆలోచన కల్పించి, మంచి మార్గమేదో నిర్ణయించుకోమనడమే నా ఉద్దేశం.

  మరి తిరగ బడిన ఆ మనసును ఏమి చేయాలి? ఎలా నిగ్రహించాలి? దీనికి కూడా వాల్మీకి మహర్షి అక్కడే సమాధానం చెప్పారు. మాయావియై కంటికి కనిపించక, తమమీద రాళ్ల వర్షం కురిపిస్తున్న తాటకను రాముడు ఎలా నిగ్రహించాడో అలానే నిగ్రహించాలి. మాయావియై కంటికి కనిపించక పోవడం అంటే ఈ మనసు ఎక్కడ ఉందో, దీని రూపమేమిటో మనకు కనిపించక పోవడం. రాళ్ల వర్షం మనపై మనసు చేసే దాడి ( ఏదో తెలియని బలహీనతకు గురిచేయడం, డిప్రెషన్ ). తాటకను రాముడు " శబ్ద వేధి విద్య " ద్వారా బాణములు ప్రయోగించి నిగ్రహించాడు.కంటికి కనిపించని వాటినికూడా కేవలము శబ్దము వచ్చు దిశను, తీవ్రతను బట్టి అస్త్రములను ప్రయోగించడం "శబ్దవేది విద్య" అంటారు. అలానే మన కంటికి కనిపించని ఈ మనసును తెలుసుకొనవలెనంటే అసలు ఆ మనసునుండి కలుగు ఆలోచనలు ఎక్కడ నుండి వస్తున్నాయో, దానికి మూలమేమిటో వెతుకుతూ వెళ్లడమే శబ్దవేది అవుతుంది. అలా చేసినట్లైతే మీ మనసుని నిగ్రహించగలరు. జీవితంలో ఉన్నత స్థితిని పొందదలచినవాడు మొదటగా నిగ్రహించ వలసినది ఈ మనసునే అని తెలుపుటకు విశ్వామిత్రుడు రాముని చేత తాటక ను వధింపచేశారు.తాటకను సంహరించుట ధర్మ బద్ధమైనదని నిరూపించినాడు. మనసు కూడా తాటక వలే స్త్రీ తత్వం కలిగి, సున్నితమైనదై ఉంటుంది. అయ్యో ఈ మనసును కష్ట పెట్టడం ఎందుకు? అది కోరినది ఇవ్వవచ్చుకదా అని భ్రమించి దానిని వదిలేశామా! ఇక అంతే! మనసుకు అడ్డూ ఆపూ ఉండదు. జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అనేక దుర్గతుల పాలు చేస్తుంది. కనుక మనసుకు మహా బలం కలదని, సక్రమంగా వాడితే అది అద్వితీయమైన శక్తిని మనకు కలిగిస్తుందని గుర్తించి, స్వేఛ్ఛావిహరిణి అయిన తాటక వలే కాక, నియబద్ధమైన దానిగా మలచుకోవాలి. మన మనసులోని కామమనే తాటకను వధించిన నాడు మీరు సిద్ధపురుషులౌతారు. కోరినది సిద్ధింప చేసుకునే మహాశక్తి వంతులౌతారు.

కానీ మనసును ఒక వైపుకు మరల్చుటకు, ఏకాగ్ర పరచుటకు గురువుల అనుగ్రహం చాలా అవసరం. రాముడు కూడా విశ్వామిత్రుని సూచన మెరకు, అతని సమక్షమున మాత్రమే ఈ తాటకను వధించినాడు. మనం కూడా ఒక గురువు సమక్షముననే ఈ సాధన చేయాలి. స్వయంగా చేయడం చాలా ప్రమాదకరం. భగవన్నామ స్మరణం సర్వదా చేసే వారికి తెలియకనే ఇవి అన్నీ జరుగుతూ ఉండును. మిగతా వారికి ఎంతో సాధన మీదనే ఈ మనోవిద్య పట్టు బడుతుంది.


రాముడేమి తపస్సు చేసెను? ( రాముడు జీవితంలో ఎక్కడా తపస్సు చేసినట్లే కనపడడు. మరి మహా మాయావులైన రాక్షసులను సంహరించాడు. గొప్పతపశ్శాలి అయిన రావణుని సునాయాసముగా సంహరించాడు. అతనికి అంతటి శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ) త్వరలో...

సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
 

ఆదిలోనే అబలను చంపుట అదేమి న్యాయం? - 1

 ఈ విషయం పై చర్చించే ముందు వాల్మీకి రామాయణంలోని ఈ ‘తాటక వధ’ ఘట్టాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకని ఈ టపాలో కథ రాస్తున్నాను.

{బాలకాండము 24-25-26 సర్గల నుండి కొంత సంక్షేపించి గ్రహిస్తున్నది. }

      తండ్రి ఆదేశం మేరకు యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుని వెంట వెళ్లిన రామడు "బల- అతిబల" అనే విద్యలను నేర్చుకుంటారు. గురువైన విశ్వామిత్రుని తో రామలక్ష్మణులు పవిత్ర గంగా సరయూ సంగమ ప్రదేశమును దర్శించి, "అచ్చటనే పరమశివుడు తపస్సు చేసెననీ - మన్మధుని దహించి వేసెనని - అందువలన అతనికి ‘అనంగుడను’ నామము కలిగెనని - ఆ ప్రదేశమునకు ‘అంగదేశము’ అన్న పేరు కలిగెనని" తెలుసుకొంటారు. అక్కడి నుండి నావపై గంగా సరయూ సంగమ ప్రదేశాన్ని దాటి కీకారణ్యమున ప్రవేశిస్తారు. రాముడు ఆసక్తిగా అడిగిన ప్రశ్నకు విశ్వామిత్ర మహర్షి ఆ అరణ్య చరిత్రను వివరించడం మొదలు పెడతారు.

       ఆప్రదేశము పూర్వము " మలదము - కరూశము " అనే జన పదములుగా ఉండెడిది. ఇంద్ర వర ప్రసాదితములైన ఆ జనపదములు అనేక సంపదలతో తులతూగెడివి. కానీ కొంతకాలము తరువాత-  పుట్టినప్పుడే వేయి ఏనుగుల బలము కలదియు, కామ రూపిణియు ఐన "తాటక" యను యక్షిణి ఇచట నివశించెను. ఆమె తన కుమారుని తో కలసి ఈ నగర ప్రజలను బాధింప సాగెను. జనపదములను ధ్వంసము చేసెను. తత్ఫలితముగా "మలదము - కరూశము" అను ఈ జన పదములు నిర్జనములుగా మారెను. తాటక ఈ ప్రాంతములను ఆక్రమించి నేటికీ జీవనము సాగించుచుండెను. శత్రుసంహారకా! రామా! నీవు నీ బాహు బలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము - అని పలికెను.

అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా ప్రశ్నిస్తాడు:

అల్ప వీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగ సహస్రస్య ధారయత్యబలా బలమ్ | |

ఓ మునీశ్వరా! యక్షులు అంతగా పరాక్రమవంతులు కారని ప్రతీతి. అబల అయిన తాటక ( యక్షిణి) వేయి ఏనుగుల బలమును కలిగియుండుట ఎట్లు సంభవము?

అందుకు సంతోషించిన విశ్వామిత్రుడు శత్రు భయంకరుడైన రాఘవునితో ఇట్లు పలికెను: "సుకేతుడను" మహాయక్షునికి బ్రహ్మ వరప్రభావమున వేయిఏనుగుల బలము కలిగినదిగా "తాటక" అను పుత్రిక కలిగెను. అట్లు జన్మించిన తాటక పెరిగి యుక్తవయస్కురాలాయెను. చక్కని రూప శోభలతో విలసిల్లెడి ఆమెను ’జంభాసురుని’ కుమారుడైన "సుందునకు" ఇచ్చి వివాహము చేసెను. తాటకకు "మారీచుడు" అను కుమారుడుకలిగెను. అతడు ఇంద్రుని యంతటి పరాక్రమ శాలి. అగస్త్యుని వలన సుందుడు మరణించగా, తన కుమారుడైన మారీచునితో కూడి ఆ తాటక అగస్త్యుని చంపుటకు పూనుకొనెను. ఆయనను తినివేయుటకు గర్జించుచూ ముందుకురికెను. అది చూసిన అగస్త్యుడు "రాక్షసత్వము పొందుము" అని మారీచుని శపించెను.

రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః
అగస్త్యః పరమ క్రుద్ధః తాటకామపి శప్తవాన్

పురుషాదీ మహా యక్షీ విరూపా వికృతాననా
ఇదం రూపం విహాయాథ దారుణం రూప మస్తుతే

"ఓ తాటకా! నీకు ఈ రూపము పోయి, భయంకర రూపము ప్రాప్తించును. వికారమైన రూపముతో, వికృతమైన ముఖముతో నరమాంస భక్షకురాలివగుము"  అను అగస్తుడు తాటకను గూడా శపించెను.

అట్లు అగస్త్యుని శాపమును పొందిన తాటక అందులకు తట్టుకొనలేక క్రోధముతో ఉడికిపోయెను. ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశమునంతయును ధ్వంసమొనర్చుచున్నది.


ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణమ్
గోబ్రాహ్మణ హితార్థాయ జహి దుష్ట పరాక్రమామ్

కనుక ఓ రాఘవా! దుష్ప్రవర్తన గలదియు, మిక్కిలి భయంకరమైనదియు, తన పరాక్రమముచే లోకమునకు ఉపద్రవములను కలిగించుచున్నదియు ఐన ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము, బ్రాహ్మణులకు హితమును గూర్చుము.

ఓ రఘునందనా! శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవుతప్ప ఈ ముల్లోకములయందెవ్వడును సమర్థుడు కాడు.

న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ
చాతుర్వర్ణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనునా

ఓ నరోత్తమా! ’స్త్రీని చంపుట యెట్లు?’ అని ఆమెయెడ కనికరము చూపవద్దు. నాలుగు వర్ణముల వారికిని ( ప్రజలందరికి ) మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యాము.

నృశంసమనృశంసం వా ప్రజారక్షణా కారణాత్
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా

ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజలహితమునకై చేయుకార్యము అది క్రూరమైనదా, తద్భిన్నమైనదా? అని చూడరాదు. అది పాపకృత్యమైనను, దోషయుక్తమే ఐనను దానిని అవశ్యము ఆచరింపవలసినదే.

రాజ్య భార నియుక్తానామ్ ఏష ధర్మః సనాతనః
అధర్మ్యాం జహి కాకుత్ స్థ ధర్మో హ్యస్యా నవిద్యతే

రాజ్యభారమును మోయు వారికి ఇది విద్యుక్త ( నిత్య ) ధర్మము. కనుక ఓ కాకుత్ స్థా! అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము. ఈమెకృత్యములలో ‘ధర్మము’ అనుమాటకు చోటే లేకున్నది కదా!


శ్రూయతే హి పుర శక్రో విరోచనసుతాం నృప
పృథివీం హంతు మిచ్ఛంతీం మంథరామభ్యసూదయత్

ఓ రామా! పూర్వము విరోచనుని సుతయైన ‘మంథర’ అను నామె భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను - అని విందుము.

విష్ణునాపి పురా రామ భృగుపత్నీ దృఢ వ్రతా
అనింద్రం లోకమిచ్ఛంతీ కావ్యమాతా నిషూదితా

భృగు పత్ని, శుక్రాచార్యుని తల్లియు ఐన ‘ఉశన’ అనునామె ఇంద్రాది దేవతలను చంపుటకు దృఢ వ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపెను.

ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్త్ర మహాత్మభిః
అధర్మసహితా నార్యో హతాః పురుషసత్తమైః
తస్మాదేనాం ఘృణాం త్యక్త్వా జహి మచ్ఛాసనాన్నృప

ఓ రాజకుమారా! ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు, సత్పురుషులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి. కావున ఓ రామా! కనికరము చూపక నా మాటను పాటించి, దుర్మార్గురాలైన తాటకను వధింపుము.

అంది అంతయు వినిన రామడు ఈ విధముగా పలికెను:

పితుర్వచననిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్
వచనం కౌశికస్యేతి కర్తవ్యమ్ అవిశంకయా

గురువర్యా! ‘ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము’ అనునది మా తండ్రిగారి ఆదేశము, వారి ఆఙ్ఞలను అవశ్యము గౌరవింతును.

అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా
పిత్రా దశరథేనాహం నావఙ్ఞేయం హి తద్వచః

 మహాత్ముడును, మా తండ్రియును ఐన దశరథుడు అయోధ్యలో వసిష్ఠాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆఙ్ఞాపించియుండెను. ఆమాట నాకు ఉల్లంఘింపరానిది.

సోహం పితుర్వచః శ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదినః
కరిష్యామి న సందేహః తాటకావధముత్తమమ్

 మాతండ్రిగారి ఆఙ్ఞప్రకారము, బ్రహ్మవాదులైన మీశాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించితీరెదను.

గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయచ
తవచైవా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః

గోరక్షణమునకును, బ్రాహ్మణులహితము కొఱకును, ఈ దేశముయొక్క సౌఖ్యము కొఱకును మహామహిమాన్వితులైన మీవచనము పాఠించుటకు పూనుకొనుచున్నాను.

అని పలికిన రాముడు తన ధనుష్టంకారము చేస్తాడు. అది విని వారిపైకి ఉరికిన తాటకను చూసి సోదరునితో " ఓ లక్ష్మణా! ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారమును. చూడుము. ఈమెను చూచినంతటనే పిఱికివారి గుండెలు బ్రద్ధలగును. మాయలమారియు, ఎదిరింపరాని శక్తికలదియు అయిన ఈమెను ముక్కు,చెవులు ఖండించి వెనుదిరిగి పారిపోవునట్లు చేసెదను. స్త్రీ అగుటవలన చంపుటకు నేను ఇష్టపడుటలేదు.( నహ్యేనాముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితామ్ )"  అనుచు ఆమెను చంపుటకు ఇష్టపడడు. ముందుగా కాళ్లు చేతులు ఖండించిన ఆమె గమన శక్తిని, శక్తి సామర్థ్యములను నశింపచేయుట యుక్తమని భావించి ఆవిధంగా చేస్తాడు. కానీ మాయావి అయిన  తాటక అనేక రూపములను పొంది వారిని భ్రమ పెట్టుటకై యత్నించెను. అది చూసిన విశ్వామిత్రుడు "ఓ రామా! నీవు ఇంత వరకు ఆమెపై చూపిన కనికరము చాలును. ఇంక ఉపేక్షింప తగదు. సంధ్యాసమయము కావొస్తున్నది. ఆ సమయములో వారి శక్తి మరింత పెరుగును కనుక వెంటనే ఆమెను వధింపుము" అని సూచించుటతో రాముడు తమపై అదృశ్య రూపములో రాళ్ల వాన కురిపించు చున్న తాటకపై "శబ్దవేధి" విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. తనను అడ్డగించు చున్న రామలక్ష్మణులపైకి మరింత వేగముగా పిడుగువలే ఉరికి వచ్చుచున్న తాటకను రాముడు వక్షస్థలముపై బాణముతో కొట్టి, ఆ తాటకకు ముక్తిని ప్రసాదించెను.

ఇది అంతయు చూసి ఇంద్రాది దేవతలు సంతసించిరి. విశ్వామిత్రునితో " ఓ బ్రహ్మర్షీ! శ్రీరాముడు దేవతలకొఱకై ఒక మహా కార్యము నిర్వహింప వలసి ఉన్నది. కావున ప్రజాపతి అయిన "భృశాశ్వుని" కుమరులైన దివ్యాస్త్రములను అన్నింటిని రాఘవునకు ఉపదేశించ వలసినది" అని పలికిరి. వారి వాక్యముల మేఱకు విశ్వామిత్రుడు రామునకు అనేక దివ్యాస్త్రములను ప్రీతితో ఉపదేశిస్తాడు. ఇవి తరువాతి కాలములో రావణునితో యుద్దము చేయుటకు ఎంతయో ఉపయోగపడినవి.

తరువాతి టపాలో ( ఈ అభినవ తాటకను వధిస్తే మీరు సిద్ధులౌతారు  లో ) ఈ కథపై చర్చ వస్తుంది.

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు. 
 

రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు?

    రాముడు శత్రు సంహరం మొదలుపెట్టినదే తాటకతో. అలా అబలను చంపుట అదేమి న్యాయము? రావణుని చూసి సీత ఆమెలా( - ) ఎందుకు నవ్వింది? సీతాదేవి బంగరు లేడిని ఎందుకు కోరింది?రాజ్య భోగాలు వదిలి వచ్చిన సీతకి బంగారం మీద మోజా ? రాముడు వాలి నెందుకు చెట్టు చాటు నుండి వధించాడు? సీతని అగ్ని పరీక్ష ఎందుకు చేశాడు? సీతపై రామునికి నమ్మకము లేదా? పతి వ్రత అయిన సీత తన తపో శక్తి తో రావణుని ఎందుకు చంపలేదు? ఓ చాకలి మాటలు పట్టుకుని మళ్లీ సీతని అడవుల పాలు చేయడం రాముని తప్పు కాదా?..............  ఇలా రామాయణం చుట్టూ అనేక ప్రశ్నలు. కొన్ని అవసరమైనవి,  కొన్ని అనవసరమైనవి, తలా తోక లేనివి.  

రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు? ఎందుకంటే రామాయణం ఉత్తమ గ్రంధం కనుక. అటువంటి కావ్యం ఇతః పూర్వం కానీ, ఇతః పరం కానీ లేదు కనుక. అది వారు కూడా ఒక విధంగా ఒప్పుకోలేక ఒప్పు కుంటున్నారు కనుక. దానికి కలిగిన ఆదరణ మరే రచనకు లేదు కనుక.

అంత ఆదరణ కలగడానికి రామాయణంలో ఏముంది? రామాయణం లో ఏముంది? అనికాదు, ఏది లేదు? అని ప్రశ్నించుకోవాలి మనం. రామాయణ ప్రారంభంలోనే తాను రచిస్తున్నది మామూలు కావ్యం కాదని, అది ఒక ఆదర్శ పురుషుని కథ అని - అనేకులకు ఇది మార్గ దర్శకమౌతుందని చెప్పకనే చెపుతారు మహర్షి వాల్మీకి.


తన ఆశ్రమానికి వచ్చిన నారదుని వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తాడు.

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మఙ్ఞశ్చ కృతఙ్ఞశ్చ సత్య వాక్యో దృఢవ్రతః | |

సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్తులకు చలించని వాడు, సామాన్య- విశేష ధర్మములనన్నిటినీ ఎఱిగిన వాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితులయందును ఆడి తప్పనివాడును, చలించని సంకల్పము కలవాడు అయిన పురుషుడు ఈ లోకమున ఎవడు కలడు? 
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కస్సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః | |

సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకును హితమును చేకూర్చు వాడు, సకల శాస్త్రా కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకునూ సంతోషమును కూర్చువాడు ఎవరు?

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే | |

థైర్యశాలియు క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడును, శొభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో, దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు?

ఇటువంటి లక్షణాలు కల మహాపురుషుడు అసలు ఎవరైనా ఈ భూమండలమున నేటి కాలములో ఉన్నాడా? ఉంటే అతని దివ్య చరితమును తెలుసుకోవాలని నాకు కుతూహలముగా ఉన్నది.

అందుకు నారదుడు  పైగుణములన్నిటికి తగిన వానిగా ఇక్ష్వాకు వంశ ప్రభువైన  శ్రీరాముని తెలుపుతాడు.
ఇక్ష్వాకువంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తరపురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయు జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియెముకలుగలవాడు, అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్థచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు......... ఇలా రాముడు సర్వగుణ సంపన్నుడని  తెలిపి అతని దివ్య కధను వాల్మీకి కి వివరిస్తాడు. 

పై గుణములన్నీ కేవలము ఒక కథలోని పాత్రకు కల్పించిన గుణములే అనుకుందాము. రామాయణము కేవలము ఒక ( చరిత్ర అని గాక ) కథ  అనుకుందాము. ఈ గుణములన్నీ కథా ప్రారంభముననే ప్రస్థావించ బడ్డాయి అంటే ఇంతటి గుణములు కల నాయకుని ఈ కావ్యము ద్వారా పరిచయం చేస్తున్నాను అని వాల్మీకి తెలుపకనే తెలుపుతున్నట్టే కదా!

అందులో ఓ భార్యా భర్తల అనురాగం ఉంది. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండవలసిన అవగాహన అద్భుతంగా చిత్రించ బడింది. ఓ తండ్రి ని ఉత్తమంగా గౌరవించిన కొడుకు కథ ఉంది. ఓ స్వామి భక్తి పరాయణుడైన హనుమ కథ ఉంది. అగ్నిని కూడా భరించ గల ఓ సాధ్వి చరిత ఉంది. ఓ స్నేహ బధం( రామ సుగ్రీవులు) ఉంది.  పిత్రు వాక్య పరిపాలకుడుగా, శిష్యుడిగా, సోదరుడిగా, భర్తగా, జగద్రక్షకుడైన రాజుగా రాముని దివ్యగుణముల కీర్తనము అణువణువునా ఉంది. ఆఖరికి రామణుని వంటి వారికి కలిగే గతీ వివరించ బడింది.ఇది ఒక చరిత్ర కాక కేవలం ఒక కావ్యం మాత్రమే అనుకుంటే ధర్మ పాలనలో రాముడు, భర్తను అనుసరించడంలొ సీత, సోదర ప్రేమలో లక్ష్మణ - భరతులు, స్వామి భక్తిలో హనుమంతుడు,  అధర్మ పరుడైన రావణుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, రాజ పదవినుండి బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడు.... ఇలా అనేక పాత్రల చిత్రణ అద్భుతంగా రచియింప బడినది. రామాయణంలో ఈ పైపాత్రలన్నీ ఆయా గుణములలో అత్యున్నతమైనవి. తరువాత ఏ కావ్యములోనూ ఆయాగుణములలో అంత కంటే  ఉదాత్త పాత్రలను సృష్టించ లేక పోయారు.అటువంటి పాత్రలను పరిచయం చేసిన వాల్మీకి రచనా పాఠవం తరతరాలు అతనిని మరువకుండా చేసింది. ఇంతటి ఉత్తమ గుణములు కలిగిన వ్యక్తులు ఒక చోట, ఒకే కాలములో ఉన్నారు అన్న ఊహే ఎంతో ఆనందంగా ఉంటుంది.   మరి కథగా చూస్తేనే ఇంతటి పరవశమైతే ఇక అది నిజంగా మన భరత భూమిమీద జరిగిన చరిత్ర అంటేనో! అందుకే మన భారతీయలుకు రామాయణం అంటే అంత ప్రేమ. పరవశం, మమేకత్వం.

మరి ఇంతటి కీర్తి కలిగిన రామాయణానికి ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?

ఫలభరితమైన చెట్టుకు దెబ్బలు తగలడం అనేది లోక సహజమే కదా!? హిందూ ప్రజలందరికీ పూజనీయమైన ఈ రచనలో, అందులోని పాత్రలలో ఉన్న నీతిని గ్రహించడం మాని దానిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు వ్యక్తులు. దానికి అనేక కారణములు ఉన్నవి.


రామాయణమును గురించి సరైన అవగాహన లేక : మనకు అనేక రామాయణములు వచ్చినవి. వాటిలో రమణీయమైన వర్ణన ఉండవచ్చునేమో కానీ అసలైన వాల్మీకి రామాయణమును తప్పుదోవ పట్టించినారు. దురదృష్ట వశాత్తు కలి ప్రభావమున ఈ నవీన రామాయణ ములే పరిచయము కానీ, వాల్మీకి రామాయణము గురించి సరైన అవగాహన ప్రజలకు లేదు.  పైగా పాఠ్య పుస్తకాలలో కూడా ఈ వాల్మీకి రామాయణమును ఎక్కడా పరిచయం చేయడం లేదు. మన దేశమునే మన రామయణమునకు ఆదరణ లేదు. అయిననూ నేటికీ రామాయణ కథ అనేకులకు ఆదర్శమవుతున్నదీ అంటే అందలి ఆదర్శ గుణములే నని చెప్పవచ్చును.

గుర్తింపు కోసం:  అవును గుర్తింపు కోసము రామాయణమును కించ పరుచు వారూ ఉన్నారు. మనం పక్కింటి వాడినో, ఎదిరింటి వాడినో తిట్టామనుకోండి వాడికీ వీడికీ ఏదోగొడవ ఉన్నట్టుంది మనకెందుకులే అని ఎవరూపట్టించుకోరు. అదే ఏ ముఖ్య మంత్రినో, ప్రధాన మంత్రినో, సినీ తారనో తిడితే అభిమానులు, వ్యతిరేకులు అందరూ "ఎందుకు తిడుతున్నాడు? ఏమిటి కారణం?" అని మనల్ని గుర్తిస్తారు.(ఇటువంటి ధృక్పధంతోనే తల్లి సీతమ్మను నిందిస్తూ రాసిన చెత్త రాతలను ఈ మధ్యనే ఒక బ్లాగులో మనం గమనించాము.) టీవీ చానళ్లు మొదలైనవి ఇక ఊదరగొట్టేస్తాయి. అలా అందరి గుర్తింపు మనకి లభిస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. ఇక మనం ఏమి చేసినా అది ఒక వార్త అవుతుంది. కొన్ని రోజులు మనం తుమ్మినా దగ్గినా అది టీవీలో వచ్చేస్తుంది. కానీ అది ఎన్ని రోజులు. కొన్ని రోజులు మాత్రమే. విషయం పాత బడిన తరువాత మనం ఎవరో పక్కింటి వాడు కూడా పట్టించుకోడు. పైగా మనం అనవసరంగా ఆ రాజకీయ నాయకుడినో, సినిమా యాక్టర్ నో తిట్టామని తెలిసినా, మన ఐడెంటిటీ క్రైసిస్ బయట పడినా మనల్ని ఓ నీచమైన చూపుతో చూస్తారు తెలిసినవారందరూ.

మత వ్యతిరేకత ( లేదా ) నాస్తిక వాదన :  మత వ్యతిరేకత తోనో, లేదా దైవము మీద నమ్మకము లేకనో కూడా అనేకులు ఈ  విమర్శలను గుప్పిస్తుంటారు. సాధారణం గా ఇటువంటి వారు ఇందులోని మంచిని గుర్తించరు. ఒప్పుకోరు. కేవలం తమకు అసమజసమని, తప్పు అని అనిపించిన దానిని మాత్రమే పదే పదే  చర్చిస్తూ ఉంటారు. ఎవరైనా విరితో వాదన మనకెందుకులే అని మాటాడక ఊరుకుంటే తామే గెలిచినట్టు, తమదే సరిఅయిన మార్గ మన్నట్టు అహంకరిస్తారు. పోనీ అది సరికాదని ఖండిస్తే, నిరూపణలతో చూపిస్తే దానిని స్వీకరించక- తప్పు అని పించినా ఒప్పుకోక మరో వాదన తీసుకు వస్తారు. ఎందుకంటే తామే నిజమైన మార్గంలో ఉన్నామన్నది వీరి ఆలోచన. తమలో, తమ భావాలలో మార్పుకు సహజంగా వీరు సిద్ధంగా ఉండరు.

ఋషుల భావం గ్రహించలేక : మన పురాణములన్నీ ఋషుల చే ప్రసాదించ బడినవి. వారు అనేక సందర్భాలలో ఆయా సంఘటనలను పూర్తిగా వివరింపక మనకే వదిలి వేస్తారు.  ఉదాహరణకు : సత్యనారాయణ కథలో పేద బ్రాహ్మణుడు వ్రతం చేసి ధనవంతుడైపోతాడు, అలాగే కట్టెలమ్ముకునే వాడు సమస్త సంపత్తులూ పొంది సుఖిస్తాడు. అని వివరింప బడి ఉంటుంది కానీ ఎలా పొందారు? అన్నదానికి వివరణ ఉండదు. సరిగ్గా ఇటువంటి సందర్భాలు విమర్శచేయడానికి  అనువుగా తోస్తున్నాయి అనేకులకు. వ్రతం చేయగా నే ధనవంతుడైపోతాడా? లేదా పూజ చేయగానే పాపాలన్నీ తొలగి సమస్త సంపదలు అలాఎలా వస్తాయి. పూజ చేస్తే చదువు వస్తుంది. పెళ్లి అవుతుంది అంటారు. ఇవన్నీ ఎలా సాధ్యం? అంత అసంబద్ధంగా రచన ఎలా చేశారు ఋషులు? వారికి స్క్రిప్ట్ రైటింగ్ సరిగా రాదా? అని వాదిస్తారు అనేకులు. నమ్మకం లేని వారికి సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ ఇలాంటి వారికి ఒక ప్రశ్న. మనం తిండి ఎందుకు తింటాం? నన్ను తప్పుగా అనుకోకండి. నిజంగానే అడుగుతున్నాను మనం తిండి ఎందుకు తింటాం? బ్రతకడం కోసం ఔనా!? మరి తిండి తింటే ఎలా బ్రతుకుతాం? తింటే ఓపిక వస్తుంది. లేక పోతే నీరసం వచ్చి క్రుంగి, కృశించి  పోతాం. అంటే తిండి మనకు శక్తి ఇస్తున్నది. అంతవరకు బానే ఉంది. కానీ ఆశక్తి ఎలా వస్తున్నది? ఆహారం గ్లూకోజ్ గామారి రక్తంలో కలుస్తున్నది. అందువలన మనకు శక్తి కలుగుతున్నది. ఇది అందరూ నమ్మే సిద్ధాంతం. కానీ ఆ పనితీరు మనకు ఎలా తెలుసు? మనమేమైనా ఎవరి ప్రేగులైనా కోసి చూశామా? లేదు అలా పరిశోధించిన అనేక మంది శాస్త్రఙ్ఞులు చెప్పారు కనుక మన చిన్న నాటి నుండీ ఆపరిశోధనలను పుస్తకాలలో చదువుకున్నాము కనుక దానిని అందరమూ నమ్ముతాము. అయితే ఇది మన నమ్మకం మాత్రమే. మనకు అందరికీ ప్రత్యక్షంగా తెలియదు. కేవలం ఆహారం స్వీకరించడం తెలుస్తోంది - శక్తి రావడం తెలుస్తోంది ( పనులు చేయ గలుగుతున్నాం కనుక ) మధ్యలో జరిగే గ్లూకోజ్ గా మారడం - రక్తంలో కలవడం వంటివి మనకు కంటికి కనపడవు. అలాగే పూజ చేయడం తెలుస్తుంది. ఫలితం రావడం తెలుస్తుంది. కానీ మధ్యలో జరిగే తంతు మనకు కనపడక దానంతట అదే మనల్ని మన లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. నిజానికి మనకు పూజలు, దైవ ధ్యానము మొదలైన వాటివల్ల  కేవలం విల్ పవర్ మాత్రమే వస్తుంది. దానితో మనం కోరుకున్నది సాధించ గలము. ఇవన్నీ కొందరు చింతన ద్వారా గ్రహించి(పరిశోధించి) వాటి సారాన్ని మనకు అనేక కథలు గా రాశారు. పురాణాలలో అనేక కథలు వివరించడంలో దానిలో ప్రధానమైన విషయాలను విశదంగా వివరించి, కొన్నిటిని మన ఆలోచనకే వదిలేశారు మన ఋషులు. కానీ అవి అర్థంకాక, కలి మాయ చేత అనేక దూషణలు చేస్తుంటారు నాగరికులు.

ఇలా అనేక కారణములతో రామాయణాది పురాణేతిహాసములు విమర్శలకు గురి అవుతున్నవి. మరి వీటిని ఆపలేమా? కనీసం ఖండించ లేమా? దానికిమార్గాలు ఏమిటి? అనేకం ఉన్నాయి.

౧. పాఠశాల స్థాయి నుండీ మన రామాయణాన్ని ఇతర ఇతిహాస పురాణాలను ( మూలములను) పాఠ్యాంశాలలో కొంత వరకైనా పరిచయం చేయాలి.
౨.  ఇంట్లో పిల్లలకి ఈ మూల రామాయణమును, భారతమును వివరించి కథలుగా చెప్తూ ఉండాలి. అందువలన మధ్యలో చేర్చ బడినవి ఏమిటో తెలుస్తుంది.
౩. ఈ విధంగా తెలిసిన విషయాలను ఎవరైనా అఙ్ఞాన వశము చేత వ్యతిరేకిస్తుంటే, కించ పరుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకొనక మన వాదనను వినిపించాలి. అది వారికొరకు కాదు. ఆ కువిమర్శలు నిజమనుకుని దానివైపు వేరొకరు ఆసక్తులవకుండా ఉండుటకొరకు. కనీసం చుట్టూ చేరిన జనులైనా నిజమేమిటో గ్రహిస్తారు. ఒక్కరికి అసలు విషయం చేరినా సంతోషమే కదా! మనం ఖండిచక పోతే సరిఅయిన అవగాహనలేని నేటి తరం పదే పదే వినిపించే భగవద్దూషణములే సరి అయిన మార్గమనుకునే అవకాశం చాలా ఉంది. కనుక మనకు తెలిసినంత మేర ఖండించాలి.

౪. కేవలం వాదన వినిపించడమే కాక, భారతీయ సాంప్రదాయము, పురాణేతిహాసములు నా ప్రాణములు. వాటిని కించ పరచడం నా దేశమును కించ పరచడమే. కనుక చట్ట పరమైన, న్యాయ పరమైన పోరాటమునకు కూడా నేను సిద్ధమే అని నిరూపించాలి.  అంటే ధర్మ యుద్ధానికి సిద్ధ పడాలి.

ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటేగానీ మన వఙ్ఞ్మయమును మనం రక్షించుకొనలేము. ఇది మన అందరి ఆస్థి. దీనిని రక్షించుకొనుట మన కర్తవ్యం. ఇప్పటికైనా గళములు విప్పి మీ వాదన వినిపించండి. ధర్మ పోరాటం చేసే వారికి మీ సమ్మతిని, మేము మీకు తోడున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి. సరి అయిన దారిలో మీరు నడవడమే కాక నలుగురినీ నడిపించండి. చూస్తూ కూర్చుంటే మన అస్థిత్వాన్నే మనం కోల్పోవలసిన స్థితి వస్తుంది.
 
 

No comments:

Post a Comment