తెలుగమ్మాయి

నిరుడు ఈ పాటి కింకా
పుట్టలేదు పాపాయి
అమ్మ కడుపులో
ఆటలాడుకోడాన్ని
ఆస్పత్రి కెళ్లి నప్పుడల్లా
ఆనందంగా చూసేవాళ్ళం
ఈ రోజు అంతర్జాలంలో చూస్తే
కాలి బొటన వేళ్లని
చిట్టి చేతుల్తో పట్టుకుని
పాలమీగడ లాంటి పరుపుమీద
పిల్లి మొగ్గలేస్తోంది
అమ్మ చేతితో
పొట్టమీద నిమిరినప్పుడల్లా
కిలకిలారావాల
చిట్టి చిలకవుతోంది-
ఆల్చిప్పల్లాంటి కళ్ళు విప్పార్చుకుని
అన్నిట్ని పరిశీలిస్తోంది
బుల్లి కుండీలో నాటిన
పొద్దు తిరుగుడు విత్తనం
రెండాకుల మధ్య
అరచేయంత పువ్వు పూసినట్టు
మెత్త మెత్తని లేత పెదవుల్లోంచి
పున్నమి నవ్వై వికసిస్తోంది
పుట్టినప్పుడే నుదుటిని మూసేస్తున్న
కందిరిగల జుట్టు
వాన కారులో కారుమబ్బై
కళ్ళనీ చెవుల్నీ కప్పేస్తోంది
కాలిఫోర్నియా రోడ్ల పక్కన
డాలియాపూలు వికసించినట్టు
పాపాయి పెదవుల్లో
అంతులేని అలపులేని
నవ్వులు విరబూస్తున్నాయి
‘అమ్మమ్మా’ అనమంటే
‘అబ్బబ్బా’ అంటుంది
అన్నం నోట్లో పెడితే
అలాగే ఉమ్మేస్తుంది
పిజ్జా ముక్కని బుగ్గల్లో
ప్రియంగా నానేస్తుంది
పక్కింటి వాకిట్లో రాలిపడిన
పచ్చి యాపిల్ కాయనీ
అమ్మ కొని తెచ్చిన
ఆరెంజి పండు నీ
ఒక్కలాగే కొరికేసి
చిత్రంగా కళ్ళు చికిలించి
పాలపళ్ల ను ప్రదర్శిస్తూ
ప్రశ్నార్ధక మౌతుంది
ఏం నచ్చుతుందో
ఎందుకు నచ్చుతుందో
ఎవ్వరం తెలుసుకోలేం
కంప్యూటర్ ఆపరేట్ చేస్తాననీ
కారు డ్రైవ్ చేస్తాననీ
అమ్మ చేతుల్లోంచి ఉరికేసి
ఆలాపన మొదలుపెడుతుంది
ఈ మధ్య కొత్తగా
పేపర్లు చింపేస్తూ
పెన్నులు విరగ్గొడుతూ
అమ్మ రాసేరాతల మీద
నిరసన ప్రదర్శిస్తోంది
అందరి దృష్టినీ
తన మీదా కేంద్రీ కరించుకుని
ఇంటికి మహారాణిలా
అధికారం చెలాయిస్తోంది
సముద్రాలకవతల
వేల మైళ్ళ దూరంలో
పలుభాషల కలయికలో
పుట్టి పెరుగుతున్నా
పండగ వచ్చిందంటే చాలు
అచ్చ తెలుగు అమ్మాయిలా
పట్టు పరికిణిలో హొయలుపోతూ
ముద్దులు మూటలు కడుతుంది
No comments:
Post a Comment