Monday, January 07, 2013

అమ్మ!

 అమ్మ!

అమెరికా నుండి వస్తూ వస్తూ అక్క సుమలత శ్రీలత కోసం సెల్ ఫోనో , వీడియో కామెరానో ,మరింకేదో మరింకేదో కాదు కానుకగా తెచ్చినది.

బ్రెస్ట్ పంప్! వినగానే ఏదోగా అనిపించింది.

అసలదేమిటో దేనికి పనికి వస్తుందో కూడా అర్ధం కాలేదు శ్రీ లతకు.

రెండేళ్ళ క్రితం ఇద్దరి పెళ్ళిళ్ళు రెండు రోజుల తేడాతో ఒకేసారి జరిగాయి.అప్పుడు వెళ్ళిన

సుమలత మళ్ళీ ఇప్పుడే రావడం.

అదీ శ్రీలత సీమంతానికి. వస్తూ వస్తూ తెచ్చిన కనుక అది.

శ్రీలతకూ సుమలతకూ సరిగ్గా ఏడాదిన్నర తేడా…అయితే ఇద్దరి అభిరుచుల్లో ఆశయాల్లో చాలా తేడా వుంది.

ముందు నుండీ చదువు చదువంటూ ఇరవై నాలుగ్గంటలూ పుస్తకాల పురుగులా

పుస్తకాలను నమిలి మింగి ఐ ఐ టి లో సీట్ సంపాదించుకుంది సుమలత. శ్రీలత మాత్రం

“అమ్మో ఆ లెఖ్కలు నాకు రావు…ఫిజిక్స్ చదివానా పిచ్చెక్కుతుంది… “అంటూ ఎమ్ పీసీ

తీసుకుందుకే నిరాకరించింది.

” ఆలోచించుకో శ్రీ రేప్పొద్దున్న అక్కను చదివించారు నాకు తెలియలేదు అంటూ బాధ

పడతావేమో …పోనీ మెడిసిన్ కి వెళ్ళరాదూ ” అంటూ నచ్చజెప్ప చూశారు తల్లీ తండ్రీ .

శ్రీలత మొహం అదోలా పెట్టి ,

” మెడిసిన్ చదవడమంటే మొత్తం జీవితాన్ని త్యాగం చేసి ఏక్షణమైనా పేషంట్ ల కోసం … వారి సేవకు సిద్ధంగా వుండాలి. లేదు నాన్నా స్వంత అభిరుచులు మానుకుని సౌకుమార్యాన్ని పోగొట్టుకుని ….నేనందుకు సిద్ధంగా లేను. నేను ఎమ్ ఏ తెలుగు చదువుతాను. సాయంత్రాలు సంగీతం నేర్చుకుంటాను…. ఇంకా సమయం దొరికితే మరేదైనా …ఇంటికి ఇల్లాలికి పనికి వచ్చేది నేర్చుకుంటాను..” ఖచ్చితంగా ధృడంగా చెప్పిన శ్రీలత ను కాదనలేకపోయారు.

అన్నట్టుగానే సుమలత అమెరికా వెళ్ళి ఎమ్ ఎస్ చేసి పీ హెచ్ డీ ముగించుకునే లోగా శ్రీలత ఏమ్ ఏ తెలుగు లో గోల్డ్ మెడల్ , శాస్త్రీయ సంగీతంలో సాయం కళాశాల నుండి ఎమ్ ఏ తో పాటు దూరవిద్య ద్వారా ఇంటీరియర్ డెకొరేషన్ లో డిప్లొమా కూడా సాధించింది.

ఓ పక్కన సాహిత్య పిపాస , తీరిక దొరికినప్పుడల్లా సంగీత సాధన , ఇల్లు పొందికగా అలంకరించుకోడం అవన్నీ చూశాక నిజమే మిషన్లు కంప్యూటర్ లకన్న మనసుకు నచ్చిన చదువే ఉత్తమం అనిపించింది అందరికీ..

ఉద్యోగం సంపాదించుకుంటూనే అప్పటి దాకా ఇప్పుడే కాదు అప్పుడేనా అంటూ నాన్చుతున్న సుమలత తనంటే ఇష్ట పడుతున్న రవి గురించి ఓ శుభోదయాన ఇంట్లో వాళ్ళకు తెలియబరచింది.

” నాక్కూడా అతనంటే ఇష్టమే … మన వాళ్ళు కాదు. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను” చెప్పింది

ఏదైనా అనేందుకు అవకాశం మిగిలితేగా …

తరువాత జరగ వలసిన వన్నీ చకచకా జరిగిపోయాయి.

రవికీ సుమలతకూ ఎప్పుడు వీలయేది కనుక్కుని, ఈ లోగా శ్రీలతకు సంబంధం చూసి ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేసి బాధ్యత నిర్వర్తించారు.

రెండేళ్ళకు ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసే అవకాశం వచ్చింది.

అందరికీ తోచిన కానుకలు అంద జేసి చివరగా శ్రీ లత ఒంటిగా వున్న సమయాన తెచ్చిన కానుక, పెద్ద లెదర్ బాగ్ ఆమె కందించింది సుమలత.

” ఇదేమిటి సుమా?”

ఇద్దరికీ పెద్ద తేడా లేక పోడం వల్ల పేర్లు పెట్టి పిలుచుకోడమే అలవాటు.

“ఇది బ్రెస్ట్ పంప్ శ్రీ “

”బ్రెస్ట్ పంపా?”శ్రీలత ఆశ్చర్య పోయింది.

” అవును శ్రీ .. ఇవింకా మన దేశంలో ఎక్కడా వచ్చినట్టులేవు…పైగా అమెరికాలో తల్లులు ఉద్యోగాలకు వెళ్ళిన సమయంలో పిల్లలకు పాలివ్వలేరు గనక మధ్య మధ్యన పాలు పంప్ చేసి బాటిల్స్ ఫ్రిజ్ లో పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చే సమయంలో ఐస్ బాగ్ లో పెట్టుకుని తెస్తారు్. ఆ పాలే తెల్లవారి రోజంతా పిల్లలకు పట్టిస్తారు. అక్కడ ఏడాది రెండేళ్లవరకూ పిల్లలకు తల్లిపాలు తాగిస్తారు. పైగా మూడు నెలల వరకు పాలు అంత ఎక్కువగా తాగరు గనక ఆ సమయంలో పాలు ఫ్రీజర్లో గడ్డకట్టించి పెట్తుకుంటారు. అవి ఏడాది వరకు ఎప్పుడు అవసర పడితే అప్పుడు వాడుకుంటారు. దీని వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాదు, పౌడర్లు , నీళ్ళు…. ఎన్ని కల్తీలో అరికట్టవచ్చు.

నిజంగా అక్కడ తల్లిపాలు అమృతంలానే భావిస్తారు.  తల్లికాబోయే నీకు అపురూపమైన కానుక ఇద్దామనిపించింది. అందుకే ఇది నీ పుట్టబోయే బిడ్డకూ ఉపయోగిస్తుందని..”

“అవునా… నిజమే ఇక్కడింకా బ్రెస్ట్ పంప్స్ రాలేదు.  ఇక్కడ ఇంట్లో వుండే తల్లులు సైతం పిల్లలకు పాలివ్వడం మానేశారు. వాళ్ళ అందాలేవో కరిగిపోతాయని… “

” పిచ్చి… నిజానికి పాలివ్వడమే ఒకరకంగా రక్షణ… తల్లికీ బిడ్డకూ కూడా ….”

” థాంక్యూ సుమా ఇంత గొప్ప కానుక ఇచ్చినందుకు …అయినా పిల్లలు పెద్దయే వరకు ఇంట్లో వుండే ఏదైనా చేద్దామని..నా ఆలోచన ” మనస్ఫూర్తిగానే అంది శ్రీలత.

మూడు వారాలపాటు అక్కా చెల్లెళ్ళు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కలబోసుకున్నారు.

” మరి నువ్వెప్పుడు అమ్మవవుతావు … నీకంటె చిన్నది మూడు నెలలు తిరిగేసరికి అమ్మవుతుంది…” మేనత్త అడిగిన దానికి నవ్వేస్తూ…

” మాదంతా ప్లానింగే … పిల్లలంటే మాటలా… వాళ్లకనువుగా అన్నీ అమర్చుకున్నాక…”

 అదేమిటే ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు స్వంత ఇల్లుకొన్నారు… ఇంకేం అమర్చుకోవాలి?” అనుమానంగా అడిగిందావిడ.

ఆవిడకు జవాబు చెప్పకుండా తప్పించుకున్నా అదే ప్రశ్న బయల్దేరేముందు శ్రీ అడిగే సరికి చెప్పక తప్ప లేదు.

“అవును శ్రీ … ఇద్దరం ఉద్యోగాలు చేసేది చెరో చోట… ఇల్లుకొన్నాం కాని దానికి నెలకింతని డబ్బు కట్టాలిగా … రవి వాళ్ళింటికి పంపాలి… ముందు పిల్లలంటే డయపర్లు వగైరా వగైరాలకు ఎంత లేదన్నా నెలకో వెయ్యి డాలర్లయినా కావాలి. పన్నెండు వారాలే మెటర్నిటీ లీవ్. ఆతరువాత పిల్లలకు డే కేర్ వెతుక్కోవాలి లేదా నానీ ని అమర్చుకోవాలి అది మరో వెయ్యి డాలర్లు…ఇవన్నీ చూసుకుని … వచ్చేఏడాది అనుకుంటున్నాములే … తొందరేముంది… ” అని నవ్వేసింది.

                **               **                    **                      **

తలనిండుగా నల్లటి ఒత్తయిన జుట్టు , పెద్ద పెద్ద కళ్ళు తెల్లటి తెలుపులో అమూల్ బేబీ లా వున్న పాపాయిని చూసుకుని పడిన నొప్పులను మరచిపోయింది శ్రీ.

అసలీ మధ్య ప్రతివాళ్ళూ మేము అఫర్డ్ చెయ్యగలం అంటూ సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నా సుమ మెయిల్స్ ద్వారా అసలు అమెరికాలో ఎంతో అవసరమయి తల్లికో పిల్లకో ప్రమాదం తప్పించడానికి తప్ప ఆపరేషన్ల జోలికి పోరని , అసలీ మధ్య ఎపిడ్యూరల్ కూడా తీసుకోకుండా కనే తల్లులున్నారనీ తెలుసుకుని , డాక్టర్ అడిగినా నార్మల్ డెలివరీ కే ప్రాముఖ్యత నిచ్చింది శ్రీ.

 పుట్టిన గంటకే తల్లి రొమ్ముల్లో తలదూర్చి పాలు తాగుతున్న పాపాయిని చూసి బుగ్గల్లు నొక్కుకుంది శ్రీ తల్లి.

” మా రోజుల్లో మూడు నాలుగు రోజులు అలవాటు చేశాక గాని పాలు తాగటం వచ్చేది కాదు. కలికాలం పుడుతూనే నేర్చుకుంటున్నారు… అయినా తల్లులే పాలిచ్చేందుకు సిద్ధంగా లేరు”

” ఎవరి సంగతెమిటో గాని నా పాపాయికి ఏడాది వరకు నాపాలే తాగిస్తాను… “

పైకి అంతే అన్న మనసులో చాలా అనుకుంది.

” నా పిల్లలు నా మాతృత్వానికి సాక్షం అయ్యే మట్టి బొమ్మలు కారు. వారి ఆలనా పాలనే నాకు ముఖ్యం … ఎంత గొప్పగా పెంచగలనో చూపిస్తాను”

అదే గదిలో మరో బెడ్ మీద సౌజన్య నాలుగు రోజుల క్రితం సిజేరియన్ చెసిన పాపడితో నానా అవస్థలూ పడుతోంది.

పిల్లడు ఒకటే ఏడుపు.

ఆరా తీస్తే ఆ తల్లి కళ్లనీళ్ల పర్యంతమైంది.

మూడు రోజులుగా ఎంత ప్రయత్నించినా చుక్క పాలు రావడంలేదు.

మందులు టాబ్లెట్స్ ఎన్ని ఇచ్చినా లాభం లేకపోయింది. పిల్లడికి డబ్బా పలు పట్టి చూశారు. ఏ రకం వాడినా ఒక్క చుక్క తాగటం లేదు. బలవంతాన ఉగ్గు గిన్నెతో పట్తిస్తే వాంతులు…

ఏం చెయ్యాలో తోచక రోజుల గుడ్డుకు సెలైన్ ఎక్కిస్తున్నారు.

అప్పుడప్పుడు దూది  పంచదర నీళ్ళలో ముంచి పెదవులకు అద్దుతున్నారు.

ఎక్కడయినా చను బాలు దొరికితే సంపాదించడం తప్పించి మరో దారి లేదని చెప్పారు డాక్టర్లు.

” ఏ జన్మలో ఏం పాపం చేశానో ..”అంటూ సౌజన్య ఒకటే ఏడుపు.

ఓ పక్కన ఆపరేషన్ నొప్పులు మరో వైపు పిల్లడి బెంగ.

శ్రీలత జాలి పడింది.

రెండు గంటలకో సారి పాపాయి పాలుతాగుతున్నా ఒకవైపు తాగే సరికే సరిపోతున్నాయి… మరో వైపు పల వల్ల సలపరం…

 రెండు సార్లు రూమ్ లోకి తీసుకు వెళ్ళి హాట్ వాటర్ బాగ్ తో కాపడం పెట్టి పాలు పిండి పారబోశాక గాని ఆ బాధ తగ్గలేద్దు శ్రీలతకు.

” మరో దారి లేదు. పాపాయికి ఒకవైపు పాలే సరిపోతున్నాయి . ప్రతి సారీ రెండో వైపు పిండి పారెయ్యండి లేకపోతే ఇలా గే బాధపడతారు.. తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తే మొత్తం ఎండి పోవచ్చు..అయినా ఇన్ని పాలుండటం మీ అదృష్టం .” అంది లేడీ డాక్టర్.

తెల్లారి పాపాయికి పాలిచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకునే సమయానికి సుమ లత నుండి ఫోన్…

” హాపీ మదర్స్ డే శ్రీ… ఇవ్వాళిక్కడ మదర్స్ డే…. అమ్మలను గౌరవిస్తారు ..నచ్చిన కానుకలిస్తారు… అమ్మ కోసం ఆన్ లైన్ లో మంచి చీర పంపాను కొత్తగా అమ్మ వయావు… ఎలా వుంది అమ్మా ఈ అనుభవం …. ” ఇంకా ఏవేవో మాట్లాడుతోంది .

కాని హఠాత్తుగా సుమ ఫోన్ చేసే సరికి మూడు నెలల క్రితం సీమంతానికి అక్క తెచ్చిచ్చిన బ్రెస్ట్ పంప్ గుర్తొచ్చింది శ్రీలతకు.

ఆ రోజున భద్రంగా కప్ బోర్ద్ లో పెట్టాక మళ్ళి దాని గుర్తే రాలే్దు.

మదర్స్ డే రోజున స్వంత అమ్మలకే కనుకలివ్వాలా…. ఎవరైనా అమ్మ అమ్మే కద….

అక్క అడిగిన వాటికి అన్య మనస్కంగ జవాబులిచ్చి ,ఆ కాల్ పుర్తి కాగానే వెళ్ళి డాక్టర్ తో బ్రెస్ట్ పంప్ గురించి మాట్లాడింది.

భర్తకు ఫోన్ చేసి లెదర్ బ్యాగ్ తో సహా దాన్ని హాస్పిటల్ కు తెప్పించింది.

” వెరీ గుడ్… దీనితో మీ సమస్య తీరిపోయినట్టే … పాలు పంప్ చేసి … ఇదిగో ఇలాగ … కావాలంటే పాలిథీన్ బాగ్స్ లో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లేదూ వారం రోజుల పాటు మామూలుగా ప్రిజ్ లో ఉంచుకోవచ్చు… ఇవింకా ఇక్కడ రాలేదు..”

మరో గంటలో సౌజన్య పిల్లవాడికి మళ్ళి సెలైన్ ఎక్కించాలి్.

పిల్లవాడు ఒకటే ఏడుపు…

బ్రెస్ట్ పంప్ తో కర్టెన్ చాటుకు వెళ్ళిన శ్రీ పావుగంటలో బాటిల్ నిండా పాలతో తిరిగి వచ్చింది.

” డాక్టర్ గారూ ఈ పాలు ఆ బాబుకి ఇవ్వవచ్చా… “

ఆశ్చర్యంతో డాక్టర్ నోట మాట రాలేదు.

“మీరు… “

“అవునండి … ఈ రోజు మదర్స్ డే ఒక అసహాయురాలైన అమ్మకు నేనిచ్చే కానుక ఇది … పైగా నాకు అవసరం లేక పారేసే పాలు మరో బిడ్డకు జీవనాధారమయితే ఇంతకన్న ఒక అమ్మ మరో అమ్మకిచ్చే గౌరవం ఏముంటుంది. … నాకు వీలైనన్ని రోజులు ఇస్తాను ఈలోగా పిల్లవాడు మామూలు పాలకు అలవాటు పడవచ్చు…”

“స్వంత పిల్లలకే పాలివ్వడానికి ఇష్టపడని తల్లులున్న ఈ కాలంలో …. అసలందరూ మీలా ఉంటే …. పసిపాపలకు పాలలోటే ఉండదు…”

మరేమో చెప్పబోయిన ఆవిడను ఆపేసింది శ్రీలత..

మనసులో మెదిలి మాటలు వల్లెవేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది.

” అమ్మంటే బొమ్మ కాదు

అందానికి పూ రెమ్మ కాదు …

పాపాయిల పాలవెల్లి

మమతలూరే కల్పవల్లి “*

No comments:

Post a Comment