ఆధ్యాత్మిక బ్లాగులు, వెబ్ సైటుల చిరునామాలు తెలియజేయగలరు
అందులో విషయం గొప్పదా కాదా, వారి ప్రయత్నం మెచ్చుకునే విధంగా ఉందా లేదా అన్నది నాకనవసరం. వారు రాసేది భగవంతుడు, భక్తి అనే విషయాలకు సంబంధించినదైతే చాలు. దయచేసి ఆ సైటు వివరాలు ఇక్కడ తెలుపగలరు.
చాలామంది ఆధ్యాత్మిక బ్లాగరులు ఫాలోవర్స్ గాడ్జట్ ని తమబ్లాగులో ప్రదర్శించడం లేదు. దయచేసి ఆవెసులుబాటు కలిగించండి చదువరులకు. మీకు ఫాలోవర్ ల మీదా దృష్టి లేకపోవచ్చు. కానీ ఎవరైనా మీ టపాలు తరచూ చదవాలి అనుకోవచ్చు కదా!? అలాగే చాలా మంది ఆధ్యాత్మిక బ్లాగరులు మరొకరి బ్లాగులలోకి కూడా ప్రవేశించడం లేదు. అదీ కాస్త మార్చుకుంటే మంచిదేమో. ఆలోచించండి.
నా వరకు నేను ఎక్కడభగవత్ విషయాలు చర్చించే బ్లాగు కనపడినా దానిని తప్పక అనుసరిస్తున్నాను. ఇంకా నాకు తెలియనివి మీరు ఎవరైనా చెప్తారని ఈ టపా రాస్తున్నాను. మరి మీకు తెలిసిన బ్లాగులు, వెబ్ సైటుల వివరాలు తెలుపుతారు కదూ!? :-)
ఆత్మలతో మాట్లాడవచ్చు.
కొన్ని కంటితో చూసి నోటితో చదివినంత మాత్రాన అర్థం కావు. మనసుతో అనుభవించి చూడవలసినదే వాటి లోతు. కొన్ని సాధారణ విషయాలలోనే అసాధారణమైన రహస్యాలు దాగుంటాయి.
నాకు చిన్నప్పటి నుండీ ఓ విచిత్రమైన కోరిక ఉంది. గాలిలో ఎగరాలని. " రావణ బ్రహ్మ రోజూ తెల్లవారుతూనే ఆకాశమార్గాన వెళ్లి కోటి శివలింగాలకు అర్చన చేసి వచ్చే వాడని " ఓసారి ఎవరో నాకు చెప్పారు. అప్పటి నుండీ అనుకుంటా గాలిలో ఎగరాలని బలమైన కోరిక. ఎంత బలమైనది అంటే నిజంగా ఈ దేహంతో ఎగరడం సాధ్యం కాదు కనుక కనీసం కలలో నైనా ఎగరాలని నా సంకల్పమో ఏమో.. సరిగా గుర్తులేదు కానీ నాకు వచ్చే కలలో చాలా వరకూ నేను ఎగురుతున్న ఎరుక నాకు తెలిసేది. ఓ సారి అర్జునుడు పాశుపతాన్ని పొందే సందర్భంలో శివుడితో యుద్ధం చేసే కథను విన్నాను. కొన్నాళ్లకు నాకు ఓ కల వచ్చింది. ఎదురుగా ఎవరో ధనుర్బాణాలతో ఉన్నారు. నేను అవే ఆయుధాలతో ఉన్నాను. ఇద్దరం గాలిలో నేలకు మూడు మీటర్ల ఎత్తులో ఉండి పెద్ధ యుద్ధం చేసుకున్నాం. అద్భుతమైన దివ్యాస్త్రాలు.
నాకోరికలు అలా కలలలో తీరుతున్నాయని అనుకునే వాడిని. ఒక్కటి మాత్రం నాకర్థమైంది. మనం బలంగా ఏవైనా కోరుకుంటే అవి కలలుగా వస్తాయని. అలా నాకొచ్చే విచిత్రమైన కలలు మిగిల్చిన అనుభవాలు ఎప్పుడు తలుచుకున్నా చాలా బలం వచ్చి నట్లు అనిపించేది. కలలు అందరికీ వస్తాయి కానీ చాలా మందికి గుర్తుండవు.
ఆ కలలు గుర్తుంచుకో గలిగితే అందరూ ఆత్మలతో మాట్లాడవచ్చు. ఆ కలలను గుర్తుంచుకోవడం ఎలాగ అని అడుగుతారేమో!? మీ సంకల్పమే మీకు దారి చూపుతుంది. రాత్రి పడుకునే ముందు నాకు వచ్చిన కలలను నేను గుర్తుంచుకోవాలి అని స్థిరంగా 4,5 సార్లు సంకల్పించుకుని పడుకోండి. క్రమ క్రమంగా మీ కలలు మెలకువ తరువాత కూడా గుర్తుకు వస్తుండడం మీరే గమనిస్తారు. అలా మీ సంకల్ప బలం, కోరిక, నమ్మకం వీటిని బట్టి మీకు గుర్తుండే శాతం ఉంటుంది.
ఇంతకీ కలలను గుర్తుంచుంకుంటే ఆత్మలతో ఎలా మాట్లాడవచ్చూ..!? అని అనుకుంటున్నారా? అదిగో అక్కడికే వస్తున్నాను.
మీకెప్పుడైనా అద్భుతమైన,వింత ఐన కలలు వస్తాయా? మీకలలలో మీరు అద్భుత శక్తులు ప్రదర్శిస్తున్నట్టు, మీతో దేవతలు- చనిపోయిన వారు - యోగులు మాట్లాడినట్లు, మీరు గాలిలో ఎగిరినట్లు, కొత్త కొత్త ప్రదేశాలు చూసినట్టు, లేదా లోకాలన్నీ తిరిగినట్టు కనిపించిందా.!?
అయితే మీకు కలల ద్వారా ఏవో సందేశాలు వస్తున్నట్టు తెలుసుకోండి. అవును కలల ద్వారానే. కలల ద్వారా మీకు సాధ్యమవ్వని దంటూ ఏమీ లేదు. మీరు కలవలానుకున్న వారిని కలవ వచ్చు. ఎంత దూరంలో ఉన్నా, అసలు భూమిమీదే లేకున్నా,ఏడేడు పధ్నాలుగు లోకాలలో ఎక్కడ ఉన్నా. మీరు కలిసి వారితో పంచుకున్న అనుభవాలను నిద్రనుండి మేల్కొన్న తరువాత కూడా గుర్తుకు ఉంచుకోవచ్చు. కాక పోతే కొంత సాధన ద్వారా.
ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రముఖ రచయిత "శ్రీ శార్వరి" చెప్తున్న మాటలు ఇవి. ఈయన మాష్టర్ సి.వి.వి. ధ్యాన ప్రక్రియకు ఆకర్షితులై, తద్వారా ధ్యానం,యోగం,ఆత్మ యాత్రలు ( astral travel ) మొదలైన అనేక విషయాలగురించి అనేక భాషలలో పలువురు రాసిన రచనలను చదువుతూ,సాధన చేయడం మొదలు పెట్టారు. అలాగే వీటి గురించి తెలుగులో అనేక పుస్తకాలు రాశారు. వాటిలో నేను ఈ మధ్య అనుకోకుండా " పరావిద్య " అనే పుస్తకం కొనిచదివాను. నేను ఇంతకు పూర్వం వీరి రచనలు ఎప్పుడూ చదవలేదు. నాకు వారి గురించి పెద్దగా తెలియదు. కానీ పుస్తకం కొద్దిగా చదివితే ఏదో ఆసక్తిగా అనిపించి కొన్నాను. ఇంటికి వచ్చి తెరచి చదివితే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. నా ఆసక్తికి సరిగ్గా తగిన పుస్తకం అనిపించింది. నాకు తెలిసిన కొన్ని విషయాలకు కొన్ని కొత్త పార్శ్వాలు కనిపించాయి. నా ఆధ్యాత్మిక సాధనకు కొన్ని కొత్త దారులు కూడా గోచరించాయి. పుస్తకం తెరచిన దగ్గరనుండీ పూర్తయ్యే వరకు ఆపకుండా దాదాపు ఏకబిగిన చదివాను.
మనకు కనిపించే శరీరం కాకుండా ఇంకా అనేక శరీరాలున్నాయి. ఈధర్ శరీరం, ఆస్ట్రల్ శరీరం, భావశరీరం,ప్రాణ శరీరం, ఆత్మ శరీరం ఇలా కంటికి కనిపించని అనేక శరీరాలు మనకున్నాయి. వాటిని కంటితో చూడడం కుదరదు. మనసుతోదర్శించాలి.
" కనిపించడం అన్నది కంటికి పరిమితం. కనిపించని దానిని దర్శించడం మనస్సు పరిధి లోనిది. అలా దర్శింప చేసే సామర్ధ్యం ఉన్నది ఆత్మకు మాత్రమే."
" ఇవ్వాళ మనం టన్నుల కొద్దీ విఙ్ఞానం,నాగరికత ఉందని సంబరపడి పోతున్నాంగానీ, ఇంతకు వేయిరెట్లు 'వివిఙ్ఞానం' ఆ (పూర్వం)రోజుల్లోనే ఉండేది. అది సంస్కారం. అప్పుడు మనవాళ్లు హాయిగా పరలోకాలకు విహార యాత్రలకు వెళుతూ వస్తూ ఉండేవారు. దేవతలతో, యక్షులతో, కిన్నెరలతో, కింపురుషులతో, గంధర్వులతో చెలిమి చేసేవారు. "
" ఈజిప్టు, రోమ్ దేశాల నాగరికతల్ని అధ్యయనం చేస్తే అక్కడి చారిత్రక అవశేషాల్ని గమనిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి. ఈజిప్టులోని పిరమిడ్లు,ప్పింక్ రహస్యాలు ఇప్పటికీ తెలియడం లేదు. వారి ఖగోళ విఙ్ఞానం, ఆత్మల అవగాహన నేటికీ ఊహాతీతంగానే ఉంది. భూమి కొలతలు, భూమికి ఇతర గ్రహాలకు మధ్యదూరాలు ఎలా కొలవగలిగారు. ఎవరూ భౌతిక శరీరాలతో వెళ్లి టేపులు పెట్టి కొలిచి ఉండరు కదా! వారికి లింకులు తెలుసు. మానవ మేధస్సును విశ్వ మేధస్సుతో లింక్ చేయడం వారికి తెలుసు. భౌతిక శరీరాన్ని ఇక్కడ భద్రపరచి, అశరీరులుగా విశ్వసంచారం చేయడం వారికి తెలుసు."
" ఏదేశ చరిత్ర పుటలు వెనక్కి తిప్పినా, ఏజాతి చరిత్రలోకి తొంగిచూసినా ఆకాలం వారికి 'అశరీర పరిఙ్ఞానం' పూర్తిగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మన పౌరాణిక కధలు, ఇతిహాసాలు, లోతుగా పరిశీలించండి. ఎన్ని అద్భుతాలు బయటపడతాయో గమనించవచ్చు. రాజులు,ఋషులు యధేచ్ఛగా అలా అలా స్వర్గానికి హనీమూన్ ట్రిప్స్ వేస్తుండే వారు. అక్కడిదేవకన్యలతో, అప్సరసలతో సరదాగా షికార్లు చేసి, సరదాలు తీర్చుకునేవారు. అలా విమానాల్లో ఆకాశమార్గాన హిమాలయాల పైకి వెళ్లేవారు. నదులు,సముద్రాలు అలవోకగా దాటి వెళ్లే వారు. ఇంద్రసభకు వెళ్లడం,నందనాల్లో విహరించడం, త్రిమూర్తుల్ని కలవడం, ముక్కోటి దేవతలతో ముచ్చట్లాడడం,ముచ్చటతీర్చుకోవడం బొత్తిగా కష్టం కాదని తెలుస్తుంది. " అంటారు మాష్టర్ శ్రీశార్వరి.
అయితే ఈపుస్తకం చదవక మునుపు కూడా నాకు ఇవన్నీ ఉన్నాయని, ఇంకా నేటికీ అనేకులు ఈ సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేస్తున్నారనీ తెలుసు. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదనే అభిప్రాయం ఉండేది. ఎంతో యోగ సాధన చేస్తే గానీ ఈ సూక్ష్మశరీర ప్రయాణం అనేది అనుభవంలోకి రాదని అనిపించేది. రోజూ ఉద్యోగాలు చేసుకునే వారికీ, సంసార బంధంలో ఉన్న వారికీ కొంత కష్ట తరమైన సాధన అనుకునేవాడిని. కానీ ఇది చదివిన తరువాత నా అభిప్రాయం పూర్తిగా తప్పని తేలింది. మనసుంటే మార్గముంటుందని మరోసారి ఋజువైంది. మాష్టర్ శ్రీశార్వరి గారు ఎంతో కష్ట తరమైన అనుభవాన్ని చాలా తేలికగా తన రచన ద్వారా మనకు అందించారు. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా ఇది ఇంత సులువైన సాధనా అనిపిస్తుంది.
వారు చెప్పిన సాధన ఏమిటంటే రోజూ ప్రశాంతంగా నిద్ర పోవడమె.. చక్కటి కలలు కనడమే.. ఆ కలలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఓ పుస్తకంలో రాసుకుని భద్రపరచుకోవడమే... ఇంతే మీరు చేయవలసింది. దీని వలన మీరు పొందేది ఏమిటో తెలుసా..!? మీరు ఎవరిని కావాలనుకుంటే వారిని కలవగలరు. భవిష్యత్తులో జరిగే వాటిని తెలుసుకో గలరు. ఎంత దూరమైనా సూక్ష్మశరీరంతో సునాయాసంగా ప్రయాణించగలరు.
రోజూ రాత్రిపూట కలలు వస్తాయి కదా. కలలకు తలా తోకా లేదు అనుకుంటాం మనం. అప్పటిదాకా చెట్టుక్రింద ఉన్న మనం ఉన్నట్టుండి ఏ ఇంట్లోనో టీవీ చూస్తున్నట్టు, ఓ కోతిగానో, దేముడిగానో, రాక్షసుడిగానో మారినట్టు అర్థం పర్థం లేని కలలు వస్తున్నాయి అని అందరూ అనుకోవడం సహజం. కానీ వీటికి అర్థం ఉంది అని మరోసారి నిరూపిస్తుంది "పరావిద్య" పుస్తకం.
" మనకు మంచి కలలు వస్తే అవి ఇంకాఇంకా సాగాలని కోరుకుంటాం. అయ్యో అనవసరంగా మెలకువ వచ్చిందే ఇంకొంత సేపు మెలకువ రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. అలాగే చెడు కలవస్తే భయంతో ఒణికి పోతాం. కానీ రెండూ మనకు సంకేతాలే. అవి చెరుపు చెయ్యవు. ఓ దెయ్యమో,ఆత్మో మిమ్మల్ని వెంటాడినట్టో, ఓ గొప్ప సౌందర్యవతి కనిపించి కవ్వింనట్టో వస్తే అవి రెండూ మీ మనసులోని కోపతాపాలను, వ్యామోహాన్నీ తెలుపుతున్నట్టు గుర్తు. ఏ స్త్రీ వ్యామోహమూ మీకు లేదనుకోండీ.. ఏ అప్సరసా మీ కలల్లోకి రాదు, అలాగే మీ మనసులో కోపతాపాలు, ఏ మలినమూ లేకపోతే రాక్షసులు రారు. మనలో దాగిన వికృత భావాలకూ, అణచుకున్న ఉద్రేకాలకూ ఆ కలలు రూపాంతరాలు. మన గుణాలకు రూప కల్పనలే స్వప్నంలో కనిపిస్తాయి. ఏ కలా ఊరికే రాదు. వాటికో అర్థం ఉంటుంది. ఓ కారణం ఉంటుంది. ఓ సంకేతం ఉంటుంది. అందించ వలసిన సందేశం ఉంటుంది. ఎటువంటి కలలైనా సరే అవి మనకు చెడుపు చేయవు. ఇలలో మనకు సహాయపడేవే అయి ఉంటాయి. మన వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి కావచ్చు, ప్రపంచ విషయాలు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినవి కావచ్చు, కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు. స్వప్నాలను విశ్లేషించడం ఒక కళ. కలలే గొప్ప పరిశోధనలకు ఆలంబనాలు. మహాజటిలమైన సమస్యలకు పరిష్కారాలు కలల్లోనే లభించాయి. మహర్షులు కలల ద్వారానే గొప్ప సత్యాలను ఆవిష్కరించారు. ఈ స్వప్న సందేశాలను ఆధారం చేసుకుని కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ఒక్కో కల మీజీవితాన్నే మార్చేయ గలదు. ప్రఙ్ఞతో అశరీర సంచారం చేయగల యోగి విశ్వరహస్యాలు సత్యాలు ఆవిష్కరిస్తాడు. "
ఎంత చెప్పినా ఇది తరిగేది కాదు కానీ, నేను అసలు ఏమి చేయాలో చెప్తాను. అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది. రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఓ ఐదునిమిషాలు మనసును ప్రశాంత పరచాలి. ముందుగా గురువులను ప్రార్థించాలి. మన చుట్టూ మనకంటికి కనిపించని గురువుల ఆత్మలు ఎన్నో ఉంటాయి. మన సూక్ష్మ శరీర ప్రయాణంలో వారి సహాయాన్ని అర్థించాలి. మనసులో మీరు చూడాలనుకున్న ప్రదేశమో, కలవాలనుకున్న వ్యక్తినో సంకల్పించుకోవాలి. ( ఫలానా ప్రదేశానికి నేను వెళ్లాలి. అక్కడ నాకు ఎదురైన అనుభూతులను పదిలంగా భద్రపరచుకోవాలి. మెలకువ తరువాతకూడా అవి నాకు గుర్తుండాలి. ఇలా మనసులో గట్టి విశ్వాసంతో సంకల్పించు కోవాలి. ) మీకు ఈ ప్రక్రియమీద ఉన్న నమ్మకాన్ని బట్టి మీకు కలిగే అనుభూతుల లోతు ఉంటుంది. మొదట్లో కొన్ని రోజులు కలల గుర్తుండక పోయినా త్వరలోనే అవి స్ఫురణకు రావడం, వాటి తాలూకా అనుభవాలు నిజ జీవితంలో ఎదురవడం మీరు చూచాయగా గమనించడం మొదలు పెడతారు.
అలా సంకల్పించుకుని మూసుకున్న కను గుడ్లను గుండ్రంగా త్రిప్పుతూ ఉండాలి. అందువలన త్వరగా నిద్ర వస్తుంది. మీ మనస్సును సూక్ష్మ శరీర ప్రయాణానికి సన్నద్ధం చేసుకోవాలి. మీరు క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. మీరు నిద్ర పోయారు అంటే మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరం నుండి విడి వడింది అని అర్థం. అలా భౌతిక శరీరం నుండి విడి వడినా భౌతిక శరీరానికీ - సూక్ష్మ శరీరానికీ ఒక దారం వంటి లింక్ ఉంటుంది. చనిపోయినప్పుడు ఆబంధం తెగిపోతుంది. నిద్రించి నప్పుడు ఎంత దూరం వెళ్లినా అది ఉంటుంది. కొందరు గొప్పగొప్ప వారికి ఆ దారం వంటి బంధం కలలలో దర్శించిన అనుభవాలు ఎదురయ్యాయి. అలా ప్రయాణానికి సిద్ధమైన సూక్ష్మ శరీరానికి ఒక స్నేహ హస్తం అందుతుంది. వారి మార్గదర్శకంలో మీరు కోరుకున్న చోటికి వెళ్తారు. వారే మీ ఆధ్యాత్మిక గురువులు.
కొన్ని సూచనలు : నేలమీద చాప వేసుకుని నిద్రించడం మంచిది. వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. నిద్రించే గదిలో ఎక్కువ వెలుతురు ఉండకూడదు. కొద్దిగా తగుమాత్రంగా వెలుతురు ఉండవచ్చు. గుండెల మీద చేతులు వేయకూడదు. అలా వేస్తే మన సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటకు వెళ్లడం కష్టం అవుతుంది. చేతులను కూడా వెల్లకిలా చాపి ఉంచాలి. శరీరం నుండి ఆత్మ విడివడడమేమిటి? మన ఆత్మ ప్రయాణం చేయడమేమిటి? అని కొందరికి వింత గొలపవచ్చు. మరికొందరికి కాస్త భయం కూడా వేయ వచ్చు. కానీ కంగారు పడనవసరం లేదు. ఈ విషయం మీకు తెలిసి నిద్రించినా, తెలియక నిద్రించినా ఆత్మ సూక్ష్మ శరీరంతో బయటకు రావడం అనేది ఖాయం. అలా ప్రయాణించినపుడు కలిగే అనుభవాలే కలలుగా మనకు కొంత గుర్తులో ఉంటాయి. వాటిని మరింత గుర్తుంచుకోవడానికీ, అలాగే మనకు అర్థం పర్థం లేకుండా వచ్చే కలలను ఒక క్రమ బద్ధంగా మన కోరిక ప్రకారం వచ్చేటట్లు మలచుకోవడానికీ మనమీ సాధన చేస్తున్నాము. అలాగే మనకు గురువులైన ఆత్మలు ఆ సూక్ష్మ లోకాలలో ఎదురు చూస్తూ ఉంటాయి. వారే స్వయంగా మనల్ని శిష్యులుగా ఎంచుకుంటారు. మన పుట్టుక తోనే ఆ ఎన్నిక అయిపోతుంది. కానీ ఆ విషయాలు మనకు తెలియవు. వారు అడుగడుగునా ఈ ప్రయాణంలో మనకు తోడ్పడుతూ ఉంటారు. కొన్ని సార్లు మీరు నిద్రలో మీకాలో చెయ్యో అసంకల్పితంగా అంతెత్తున లేపి దబ్బున క్రిందపడేస్తారు. ఉలిక్కి పడి, శరీరం ఎగిరి పడుతుంది. ఈ సాధన చేసే వారికైనా, చేయని వారికైనా ఇది సహజంగా అప్పుడప్పుడూ జరిగే విషయమే. అంటే మీ సూక్ష్మ శరీరం బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఏదో ఇబ్బంది రావడం వలన అలా జరుగుతోంది. మీరు సరిగ్గా వెల్లకిలా పడుకుంటే సరిపోతుంది. అలాగే ఒక్కో సారి మీరు నిద్రలో ఉండగానే మీ చెయ్యో కాలో కదపాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఎంత కదిపినా అవి కదలవు. అలా ఎందుకవుతుందంటే బయట తిరిగే ఆత్మలేవో మిమ్మల్ని అల్లరి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఆత్మలకు అలా చేయడం సరదా. అందుకు మీరు భయపడనవసరం లేదు. అవి అంతకన్నా ఏమీ చేయలేవు. మీకు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ (సూక్ష్మ శరీర ప్రయాణం) లో ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా మీ సూక్ష్మ శరీరం వెంటనే వచ్చి భౌతిక శరీరంలో చేరిపోతుంది. మీకు వెంటనే మెలకువ వస్తుంది. కనుక భయం అవసరంలేదు. ఎటువంటి భయాలు లేకుండా ఈ ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మీ సాధన సక్రమంగా సాగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు గురువులు ఎప్పుడూ అండగా ఉంటారు. అలాగే ఈ ప్రయాణంలో 99.99...% ఏటువంటి ఇబ్బందులూ ఎదురవ్వవు. ఇది సహజమైన ప్రక్రియే. కాకపోతే కాస్త ఎరుకతో చేయలనుకునే ప్రయత్నం. మీకు గల నమ్మకం, ఉత్సాహం ఈ ప్రయాణంలో అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. మీరు మీ వంశీకులను, దేవతలను, మీ ఇష్టులను కలవవచ్చు - స్వర్గం, హిమాలయాలు, పవిత్ర ప్రదేశాలు, ఏడేడు పధ్నాలుగు లోకాలు, బ్రహ్మాండాలు వేటినైనా దర్శించ వచ్చు. ముఖ్యంగా ఎటువంటి వారికైనా చావు అంటే భయం పోతుంది. రోజూ వెళ్లి వచ్చే ప్రయాణమే, కాకపోతే కాస్త దీర్ఘ ప్రయాణం అన్న ధీమాతో ఉంటారు. మన కంటికి కనిపించేది కాక వేరే లోకాలు ఉన్నాయని, అవి ఈ లోకాల కంటే అందమైనవి, సుఖవంతమైనవి, అమిత ఆనందాన్నిచ్చేవి అని తెలియడం వల్ల - నసించేది నేను కాదు, నా శరీరం, ఇది లేక పోయినా నేను మరింత ఆనందంగా ఉండగలను అని అర్థమవ్వడం వల్ల సులభంగా మరణాన్ని సమ్మతించ గలుగుతారు.
నాకు చిన్నప్పటి నుండీ ఓ సందేహం ఉండేది. "యోగము ద్వారా చనిపోవాలి అనుకున్నప్పుడు చనిపోవడం అనేది అందరికీ సాధ్యమేనా? " అని. దానికి చిన్నప్పటి నుండీ యోగ సాధన బాగా చేస్తే అది సాధ్యమే అని తెలుసు. కానీ దానికి ఇంత సులువైన ప్రారంభముంటుందని మాత్రం ఈ పుస్తకం చదివిన తరువాత తెలిసింది. విద్వత్తు ఎవరి వద్దనైనా ఉంటుంది. దానిని నలుగురి మంచి కోసం వినియోగించగల ప్రఙ్ఞ కొందరికి మాత్రమే ఉంటుంది. అటువంటి ప్రఙ్ఞతో రాసిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక అభిలాషులు అందరూ చదవవలసినది. శ్రీ శార్వరి గారు నేటికీ మాష్టర్ గా అనేకులకి ఈ యోగ విద్యను నేర్పుతున్నారు. పూజాదికాలు అవసరం లేదని వీరి అభిమతం. మాష్టర్ సి.వి.వి. గారికి మరో అనుయాయులు ఎక్కిరాల క్రిష్ణమాచార్య గారు. వీరు సాంప్రదాయాలను, పూజాదికాలను ప్రోత్సహిస్తూనే తద్వారా యోగ జీవితానికి బాటను చూపారు. ఎవరి మార్గం వారిది అయినా చేరే గమ్యం ఒక్కటే.
నిద్రపోవడం ఎవరికి మాత్రం కష్టం చెప్పండి. అందుకే ఇది సులవైన ప్రారంభం అని చెప్పుకోవచ్చు. పైగా కలిగే ఫలితం అమేఘం, అద్భుతం. సూక్ష్మ శరీర ప్రయాణం ద్వారా అణిమాది అష్టసిద్ధులు, పరకాయ ప్రవేశం, కంటికి కనిపించని దివ్యలోక సందర్శనం మొదలైన వాటిగురించి తెలుస్తుంది. మనం సాధించవలసినది ఏమిటో ఎఱుకలోకి వస్తుంది. వీటితోనే ఆనందపడిపోయి ఇదే సర్వమనుకుని అక్కడే నిలచే వారూ ఉన్నారు. కలిగిన ఎఱుక ద్వారా మరింత ముందుకు వెళ్లవలసి ఉన్నదని గుర్తెరిగి మరింత సాధన చేసే వారున్నారు. ఇదే పరమావధి కాదు అని స్ఫురణలో ఉంచుకోవాలి మనం. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి ఆత్మ స్వయంగా ప్రకాశించ గలగడం మన లక్ష్యం. అది అందరికీ సాధ్యపడదు. సత్యలోక దర్శనం కోసం ఎంతో యోగ సాధన చేయాలి. మనం నిద్రపోయి ఏమీ తెలియని స్థితిలో దర్శించే ఈ లోకాలన్నీ ధ్యానముద్వారా ఎప్పుడనుకుంటే అప్పుడు అంతర్ముఖులమై శరీరాన్ని విడచి ప్రయాణించ గల శక్తిని సముపార్జించడానికి ఈ అనుభవం ఎంతో ప్రేరణనిస్తుంది.
సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు| సర్వేజనాసుఖినో భవంతు| సత్యాస్సంతు యజమానస్యకామాః||
ప్రశ్నించే వారు అనేకులు ఉన్నారు - జవాబు ఇచ్చేవారేరి?

నాకేమొస్తుంది? విద్య, ఉద్యోగం,భార్య,పిల్లలు చివరకు దేముడి వద్ద కూడా నాకేమొస్తుంది? ఇదే ప్రశ్న. మిగతా చోట ఏమో కానీ భగవంతుని విషయంలో మాత్రం నాకేమొస్తుంది? ఇది వస్తుందా? అయితే చేస్తాను. అని చేసేవారికి ఫలితం సూన్యం.
కానీ గురువులు " పరమేశ్వరుడు మహా బోళా మనిషి. తెలిసి తలచినా, తెలియక తలచిన, ఏదైనా ఆశించి తలచినా, ఏమీ ఆశించక తలచినా పరుగున వచ్చెస్తాడు. అతని కరుణ అపార మైనది " అని చెబుతారు. ఇదే నేటి కాలంలో పెద్ద ప్రశ్న అయి కూర్చుంది.
ఏమిటీ!? నువ్విలా పిలిస్తే అలా వచ్చేస్తాడా? నీ పాపాలన్నీ కరిగించేస్తాడా? అడిగిన వన్నీ ఇచ్చేస్తాడా? ఏదీ ఓసారి పిలిచి చూపించు. నేనూ చూస్తాను నీ కష్టాలు ఎలా తీరతాయో... నా కెప్పటి నుండో ఓ అనుమానం. అసలు ఎవరైనా ఈ పని చేస్తే నాకేమిటి అని ఒకటికి పది సార్లు ఆలోచించి చేసే ఈ రోజులలో ముందూ వెనుకా ఆలోచించకుండా వచ్చేస్తాడా ఆ వెర్రి వెంకన్నా!? పోనీ దేముడు కదా వస్తే వస్తాడనుకుందాం. కానీ నీలో స్వార్థంతో ప్రార్థించినా వచ్చేస్తాడా?
ఏదీ ఒక్క సారి చూపించు. నేనూ చూస్తాను అతను ఎలా ఉంటాడో.?
సత్యాన్వేషణ అనే పేరుతో పలు వ్యక్తులు వేశే ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి? ఎటు నుండి చెప్పాలి? నేను ఒకటి చెప్పనా! సత్యాన్వేషణ వేరు, రంధ్రాన్వేషణ వేరు. పై విధానం రంధ్రాన్వేషణ అవుతుంది కానీ సత్యాన్వేషణ కాదు. మేము చెప్పేది గొప్ప. మీరు పాఠించేది శుద్ధ దండగ. మీరు వెర్రి వాళ్లు కాబట్టి మా మాటలు విని ఆ భక్తి మార్గం వీడండి. అంటూ చెప్పేది రంధ్రాన్వేషణే అవుతుంది.
అలా కాక జీవించడానికి పలు మార్గ్గాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఈ భక్తి అనేది ఒకటిగా కనిపిస్తోంది. కానీ నాకు అందులో నమ్మదగిన సత్యం గోచరించడం లేదు. అయినా అన్వేషిద్దాము. ఇందులో ఎంత సత్యం ఉందో. గురువులు ఏమి చెప్తున్నారు? శిష్యులు ఏమి పాటిస్తున్నారు. మనకు కనిపించే తేడా గురువుల వద్ద ఉన్నదా? శిష్యుల వద్ద ఉన్నదా? అసలు పూర్తిగా ఆవిధానం లోనే ఉన్నదా? లేదా నాదగ్గరే లోపం ఉన్నదా? ఇలా అన్ని వైపులా అన్వేషణ సాగిస్తే అది సత్యాన్వేషణ అవుతుంది.
మనిషి దేనికోసం జీవిస్తాడు? అతని అంతిమ ఆశయం ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? చిన్న పిల్లవాడికి చదవాలని,ఆటలాడాలని కోరిక. చదువుతరువాత మంచి ఉద్యోగం సంపదించాలని కోరిక. తరువాత భార్య,పిల్లలు ఇలా ఒకదాని తరువాత ఒకటి. ఇవన్నీ ఎందుకు? దేని కొసం ఈ కోరికలన్నీ కలుగుతున్నాయి? దీనికి సమాధానం దొరకాలంటే ప్రశ్న మరోలా వేసుకోవాలి. ఈ కోరికలు తీరితే మనకు ఏమి కలుగుతుంది? ఏమి కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. కానీ అది క్షణ కాలమే ఉంటుంది. మళ్లీ ఏదో కావాలంటుంది మనసు. మళ్లీ దానికోసం అన్వేషణ. అది లభిస్తే కొంత కాలం ఆనందం. ఇలా మళ్లీ మళ్లీ అడిగే మనసుకు అసలు ఏమికావాలి? నేను చెప్పనా? ఎప్పటికీ ఉండే ఆనందం కావాలి. మళ్లీ చెప్పాలంటే తృప్తి కలిగేంత ఆనందం కావాలి. దానికోసమే మనిషి పరుగు. అదే అతని అంతిమ మజిలీ. ఈ పరుగులో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అందరూ చివరికి చేరేది పరిపూర్ణ ఆనంద తీరానికే. కాకపోతే ఒకళ్లు ముందు, ఒకళ్లు వెనుక అంతే.
ఏదీ తెగేదాకా లాగకూడదు. కొత్త విషయం తెలుసుకోవాలనుకోవడం మంచిదే. కానీ అన్ని విషయాలు నాకే తెలియాలనుకోవడం మొదటికే మోసం తెస్తుంది.
ఒకామె వంట బాగా చేసేది. కానీ కొంత కాలానికి ఆమెకి ఏ వంటచేసినా ఉప్పెక్కువో, కారమెక్కువో ఇలా ఏదో ఒక లోపంతో వంట చెడి పొతోంది. దానితో పదిమందీ వచ్చినప్పుడు ఆమె పరువు పోతోంది. పైగా పూర్వం బాగా వంట చేయగలదన్న పేరు. తీరా ఇప్పుడు గడ్డిలా ఉన్న వంట తిని ఏమంటారో. అన్న బెంగ ఎక్కువై పోయి చేతులు కాళ్లు వణికి పోతున్నాయి. తెలియని భయం ఆవరించి కళ్లు తిరిగి క్రింద పడిపోతోంది. దానితో ఆమె ఒక సైక్రియాటిస్ట్ ని కలిసింది. అతను అంతావిని ఓస్ ఇంతేనా మరేం ఫర్వాలేదు. మీరు వంట చేసే టప్పుడు మీకు ఇష్టమైన సంగీతంవింటూ వంట చేయండి. క్రమ క్రమంగా మీరు పూర్వం వలే వంట చేయగలుగుతారు. మీ వణుకు తగ్గుతుంది. అని ధైర్యం చెప్పి పంపించాడు. ఆమె ఇంటికి వెళ్లి అలా వంట చేయడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న వాళ్ల్లు ఇది చూసి ఇదేమి చోద్యమే!? అసలే పరధ్యానంతో వంటలు తగల బెడుతున్నావు. ఇప్పుడు పాటలు పెట్టుకుని వంటలు చేస్తే ఇకమేం తిన్నట్టే అని ఒకళ్లు. అయినా ఇలా ఎన్నాళ్ల్ల్ల్లు పాటలు వింటూ వంట చేస్తావు? అని ఒకళ్లు, ఎన్నాళ్లైనా ఇలా గడపాల్సిందేనా? అని మరొకళ్లు. ప్రశ్నల మీద ప్రశ్నలు. అసలే ఆమె మనస్థితి బాగోలేదు. పైగా ఈ ప్రశ్నలతో ఆమెను రోజూ బుర్రతింటూ ఉండడంతో వంటలు బాగు కాలేదు సరికదా, ఆమెకు మరింత భయం పెరిగి పోయింది. ఎప్పుడో కొత్త వాళ్ల్లు వచ్చినప్పుడు వంట చేయాలంటే వచ్చే వణుకు ఇప్పుడు మామూలుగా రోజూ వంట చేయాలంటేనే వస్తోంది. మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లిన ఆమెద్వారా అంతా విన్న డాక్టరు ఈసారి మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్లందర్నీ తీసుకురండి అని చెప్పాడు. అలాగే తీసుకు వెళ్లింది. ఆమెను బయటకు పంపి వాళ్లందర్నీ కూర్చోబెట్టి " మీకు బుద్దుందా లేదా? అసలే మనస్థితి బాగోలెని ఆమెకు మీరు మరింత భయాన్ని కలిగిస్తారా? నేనా డాక్టరు మీరా? మీకంతా తెలిసినప్పుడు మరి నాదగ్గరకు రావడం దేనికి మీరే నయం చేయలేక పోయారా? అని చివాట్లు పెట్టాడు. బిక్క మొహాలు వేసిన వారితో అనునయంగా అసలు విషయం చెప్పాడు. " ఆమెకు భర్త చనిపోవడంతో, బంధువులైన మీ మీద పిల్లలతో సహా ఆధారపడ వలసి రావడంతో ఆలోచనలు పెరిగిపోయాయి. ఎలా బ్రతకడం? పిల్లలకు దిక్కేది? అనే బెంగ మొదలైంది. ఆ బెంగలో నిద్ర కరువైంది. నిద్ర సరిగా లేక పొవడం వలన అనేక శారీరక మార్పులు సంభవించాయి. అలాగే పరధ్యానమూ అలవడింది. ఏ పనీ సవ్యంగా చేయలేకపోవడం, చిన్న సమస్యకే పెద్దగా క్రుంగి పోవడం, నిరాశ నిస్పృహలకు లోనవడం మొదలైంది. మనసులో గూడు కట్టుకున్న భయం వలన ఆమె మానసికంగా కృశించి పొయింది. అన్ని పనుల్లోను అంతో ఇంతో తేడాగా ప్రవర్తిస్తున్నా ఆమెకు ప్రధానంగా మీరు అప్ప చెప్పిన వంట బాధ్యత వల్ల దానిలో తాను చేసే లోపాలే ఆమెకు పెనుభూతంలా కనిపించ సాగాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి ఆమెను ఇంతవరకూ తీసుకు వచ్చాయి. దీని కంతటికీ కారణం విపరీతమైన ఆలోచనలు . ముందు వాటిని మళ్లించ గలిగితే మనసు కాస్తకుదుట పడితే మళ్లీ మామూలు స్థితి వస్తుంది. అందుకే రాత్రి నిద్ర పట్టడానికి మందులు ఇస్తూనే ఆమెకు సంగీతమంటే ప్రాణమని తెలుసుకున్న నేను ఇష్టమైన పాటలు వింటూ వంట చేయమన్నాను. అలా కొంత వరకు ఆలోచనలు తగ్గుతాయి కనుక. కానీ మీరేం చేశారు. ఆమె మనసును మరింత కల్లోల పెట్టారు. దానితో మొదటికే మోసం వచ్చింది. ఇక్కడ ఒక విషయంలో మిమ్మల్ని అభినందించాలి. సొంత తల్లిని కూడా సరిగా చూసుకోవడం కరువైపోతున్న నేటి రోజులలో ఆమెకు చెల్లెళ్లైన మీరు ఇంత ప్రేమగా చూసుకోవడం, దానికి మీ భర్తలు కూడా అభ్యంతర పెట్టక పోవడం చాలా గొప్పవిషయం. ఇకనైనా పరిస్థితి అర్థం చేసుకుని ఆమెకు అనుగుణంగా నడుచుకోండి, చేతనైతే ఆమెలో ధైర్యాన్ని పెంచే మాటలు మాట్లాడండి త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది అని చెప్పి పంపించాడు. ఇక ఆతరువాత ఎప్పుడూ ఆమె అటువంటి భయంతో డాక్టరు వద్దకు రాలేదు.

అలాగే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే పెను మానసిక రోగాలను క్రమ క్రమంగా తొలగించి, మన జీవితాలను పరిపూర్ణ ఆనందం వైపు పయనింప చేయడానికి భారతీయ గురువులు శ్రమించి ఓ జీవన విధానమును ఏర్పరచారు. మనకు ప్రసాదించారు. కానీ మానవుడు స్వార్థమునకు లొంగి దానిని కూడా పూర్తిగా పాఠించక తనకు అనుకూలముగ ఉన్నంత వరకు పాఠించి, కష్ట తరముగ ఉన్నదానిని పాఠింపక, తనను పరులు తప్పు పట్టు లోపల తానే ఇతరుల నడవడికను ప్రశ్నించి మభ్యపెట్టి వారిచేత కూడ తన మార్గమును శహభాష్ అనిపించుకొని తానేదో క్రొత్త మార్గమును కనుగొన్నా ననుకొని తాను భ్రమిస్తూ, ఇతరులను భ్రమింపచేస్తూ బ్రతుకుతున్నాడు. అదే భారతీయత అనుకొంటున్నాడు. మరోవైపు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రపంచీ కరణ పుణ్యమా అని దేశాల మధ్య దూరం తరిగి అనేక అలవాట్లకు లోనై కన్న తల్లినే విమర్శించే వారు కొందరు తయారవుతున్నారు. ఈ విమర్శలు కొంత వరకూ మంచిదే. మొదటి రకం వాడు తన తప్పులను సరిదిద్దు కోవడానికి పనికి వస్తుంది.
అలా దిద్దుకున్న వాళ్లు అనేకులు ఉన్నారు. అలాగే కాలానుగుణంగా కూడా కొన్ని మార్పులు అవసరం. ఆ కోవలోనే సతీసహగమనం, బహుభార్యాత్వం మొదలైన సంఘసంస్కరణలు జరిగాయి. మంచీ చెడూ సమానంగా ఉన్న నేటి సమాజంలో పుట్టిన మనం మనలను సరిదిద్దుకోవడానికి చాలా దోహద పడుతున్నాయి. మన భారతీయ విలువల గొప్పతనాన్ని మరింత తెలుసుకునేలా చేస్తున్నాయి. కానీ ఈ మార్పును చూసి నేనేదో గొప్ప ఘన కార్యం చేశాను, నేనలా ప్రశ్నించడం వల్లే ఈ సమాజంలొ పెను మార్పులు సంభవించాయి అని అత్యుత్సాహంతో మరింత లోతుకు వెళ్లి భారతీయ మూలాలనే తూలనాడే స్వభావం హర్షించదగినది కాదు.
మితిమీరిన కామంలో పడి గిలగిల లాడుతున్న మనకు సత్యం ఎక్కడ కనిపిస్తుంది? అందుకె ఆ పై కథలోని ఆ బంధువుల వలే ప్రశ్నిస్తాం.
" ఏమిటీ మనిషి మనో రోగాలను పోగొట్టి మంచి మార్గంలో పయనింప చేయడానికి ఈ జీవన విధానం రూపొందించ బడినదా? అంటే పుట్టుకతోనే మనకి అనేక మనో వైకల్యాలున్నాయా? వాటి కోసం మనం బ్రతికినంత కాలం ఈ తలా తోకా తెలియని దారిలో నడవాలా? "
ఇవే కదా మీ మనసులో ఇంకా మిగిలి ఉన్న ప్రశ్నలు. ప్రతీ రోజూ అన్నం తింటాం. ఎన్ని సార్లు తిన్న మళ్లీ తింటాం. ఎందుకని. మనకు శక్తి లేదానా? కాదుకదా? శక్తి నశించ కూడదని తింటాం. అలాగే మన జీవన విధానమూ ఓ క్రమ పద్ధతిలో మనలోని ఆనందాన్ని ఇనుమడింపచేసి శాశ్వత ఆనందం వైపు పరుగు పెట్టిస్తుంది. దీనిని పాఠించే వారిలో తప్పులున్నాయేమో గానీ. పూర్తిగా ఈ విధానంలోనే తప్పులున్నాయనడం అసమంజసం.
ఏమిటి మరి ఆ జీవన విధానం?
నీలోకి చూడడం అంటే నిన్ను చూడడమే. నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు లోకాన్ని తెలుసుకుంటావు. లోకాన్ని ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో! నేనెవరు? నాకు కావలసినదేమిటి? నా పుట్టుకకు మూలం ఏమిటి? దాని పరమార్థం ఏమిటి? అని ఎప్పుడైనా ప్రశ్నించావా? సంతృప్తికర సమాధానం రాబట్టావా? అన్వేషణ సాగించావా? సమాజాన్ని చదవడం నీకు తెలుసేమో!? నిన్ను చదవడం తెలుసా? అదే పరా విద్య. అది తెలిసిన నాడు మృత్యువును జయిస్తావు. చావుకు తెగిస్తావు. తోటి ప్రాణిలో నీరూపు చూస్తావు. తన కష్టం నీ కష్టంగా తపిస్తావు. నీ మాటలో చూపులో చర్యలో ప్రతి చర్యలో అణువణువులో అమృతం ఒలికిస్తావు. ఆ రహస్యం తెలియాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు నువ్వు వరుసగా స్వీకరించ వలసినదే! కాదని కోరికలతో రగిలి ప్రక్కదారి పట్టారా..? అన్నీ ఉన్నా ఆనందం మీకు కరువే! పోనీ ఇవేమీ వద్దని సరాసరి సన్యాసానికే వచ్చేశారా..? నిత్యానందుని గతి ఏమయిందో మీకు తెలుసుగా? ఏదైనా ఓ క్రమ పద్ధతిలో సాగాలి.
కాళిదాసు రఘువంశ రాజుల జీవనం గురించి ఈ విధంగా చెప్తాడు.
త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం|
యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం||
యోగ్యత కలవారికి దాన మిచ్చుటకే ధనమార్జించు వారును, నిజము పలుకుటకై మితముగా మాట్లాడు వారును, కీర్తి కొరకే విజయము పొంద గోరువారును, సంతానము కొరకే వివాహమాడు వారును...
శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం|
వార్థకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం||
బాల్యము నందు విద్యలు నేర్చు వారును, యవ్వనమున విషయా సక్తులును, వార్థక్యమున మౌనమును పాఠించుచూ సంపదలను అన్నిటినీ త్యజించి వాన ప్రస్థ జీవనము సాగించు వారును, అవసాన కాలమున సంకల్ప మాత్రము చేత యోగ మార్గమున శరీరమును త్యజించు వారును.... ( అయిన రఘువంశ కథను చెప్పబోవు చున్నాను )
ఈ గుణములు మనకు ఆదర్శములు.
ఆస్తిక - నాస్తిక వాదన
దేముడిని నమ్మి రోజూ పూజలూ, ప్రార్థనలూ చేస్తూ ఉండే వారు ఆస్తికులు. దేముడు లేడని నమ్మి ఎటువంటి పూజలూ, ప్రార్థనలూ చేయని వారు నాస్తికులు. కానీ నేను తెలుసుకున్నది ఏమంటే ఈ ఇరు వర్గాల వారూ భగవంతుని కృపకు పాతృలవుతున్నారని.
అయితే ఆస్తికుల దృష్టిలో నాస్తికుల గురించి ఇంకా చాలా అభిప్రాయాలున్నాయి. ఏమనంటే నాస్తికులు భగవంతుని కృపకు పాతృలు కాలేరని, అందుకు కారణం వారికి ఒక నీతి నియమము లేకపోవడమేనని, ఇటువంటి వారు జాతికే భ్రష్టత తెస్తారనీ ఇలా చాలా రకాల అభిప్రాయాలు నాకు ఆస్తికులలో కనిపించాయి. ఇది నేను సమ్మతించలేను. ఎందువలనంటే భగవంతుని నమ్మే చాలా మందిలో కూడా అనేక దురలవాట్లు, వ్యసనాలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసిన ఓ భక్తుడు ఖూనీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. కానీ అతను ప్రతిరోజూ శివ పూజచేస్తాడు. రోజూ దేవతార్చన చేస్తూ కన్న తల్లిని తిట్టే, స్త్రీని మితిమీరిన కామంతో చూసే ఎంతో మందిని నేను చూశాను.
మరి అటువంటప్పుడు ఆస్తికులు కూడా భగవంతుని కృపను పొందలేరు అని అనడం సముచితమేగా...? కాదు. ఎందువల్లనంటే ఎవరో ఒక్కరు తప్పు చేశారని ఒక వర్గం మొత్తాన్నీ తప్పు పట్టలేము కనుక. ఇదే కారణంచేత నేను నాస్తికులను కూడా తప్పు పట్ట వద్దు అంటున్నాను. నాస్తికులైనా, ఆస్తికులైనా తప్పుదారి పట్టక, ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్న వారైతే వారికి తప్పక సత్యం బోధ పడుతుంది.
మనం నేడు తినే తిండీ, త్రాగే నీరు, పీల్చే గాలీ ప్రతీదీ కలుషితమైనట్లే మన భావ సంపదకూడా కలుషిత మయంగానే ఉంది. అదే విధంగా నేటి మన ఆస్తిక, నాస్తిక జనులు కూడా కలుషితమైన భావాలతో ఉన్నారు.
అసలు భగవంతుడు ఎవరు? అతనికృపకు పాతృలము ఎలా అవుతాము?
అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు నాకు మన మతము, ఇందు పొందు పరచబడిన క్రమబద్ధమైన విధానాలూ ఒక మార్గంలా మాత్రమే అనిపిస్తాయి. అలాగే ఇతర మతాల మార్గాలు కూడా.
శ్లో.. దేహో దేవాలయహ్ ప్రోక్తో జీవో దేవస్సనాతనహ్
త్యజేదఙాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్
మనదేహమే దేవాలయము. అందు ఉండు జీవుడు సనాతనమైనటువంటి భగవంతుడే. నాలో ఉండు అఙానమును తొలగించి నీవే నేనను భావనతో నిన్ను పూజించెదను. అంటూ మహన్యాస పారాయణంలో భక్తుడు స్తుతిస్తాడు. అలాగే " నారుద్రో రుద్రమర్చయేత్ " అనికూడా న్యాసంలో చెప్పబడి ఉంది. అంటే రుద్రుడు కానివాడు రుద్రుని పూజించలేడు.
ఇటువంటి ఉదాహరణలు అనేకం వేదంలో ఉన్నాయి. వీటి వల్ల మనలోని జీవుడు, ఆ దేముడు వేరు వేరు కాదనీ ఇద్దరూ ఒకటే ననీ తెలుస్తున్నది. అంతెందుకు మనం చేసే వృత్తిలో, పీల్చే గాలీలో, నీరులో , ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలోని ప్రతి వస్తువూలోనూ ఆభగవంతుడున్నాడు అని ఆస్తికులందరూ అంగీకరిస్తారు. మరి వీటి యందు భగవంతుడున్నాడని నమ్మి ఆస్తికులు సేవించినా, భగవంతుడి సేవ అనే భావనతో కాక వాటి యందు ఇష్టంతో మాత్రమే నాస్తికులు వాటిని సక్రమంగా ఉపయోగించినా ( అంటే వృత్తిని చిత్త శుద్ధితో చేయడం, చెట్లను పెంచుతూ వాటితో మాట్లాడుతూ గడపడం మొ..వి ) ఇద్దరికీ సమానమైన ఆనందమే కలుగుతున్నది కదా!? ఇది ఆస్తికులు ఒప్పుకునే ఉదాహరణ. ఇది ఇక్కడ ఆపి మరో ఉదాహఋరణ చూడండి.
నాకు ఇద్దరు స్నేహితులున్నారు అనుకుందాము. ఒకరు ఆస్తికులు, ఒకరు నాస్తికులు. ఇద్దరూ ఒకసారి మనసు కలత చెందింది అంటూ నావద్దకు వచ్చారు. అప్పుడు స్నేహితుడిగా నాకర్తవ్యం వారికి ఏ కారణం వలననో కలత చెంది చలించిన మనసును శాంత పరచడం. అప్పుడు నేనేమి చేస్తానో తెలుసా?
ఆస్తిక మిత్రునిచేత కొంతసేపు ధ్యానము చేయించడమో, మంత్రాలు చదువుకోవడమో చేయిస్తాను.
మరి నాస్తిక స్నేహితునికి అలా చేయడం ఇష్టముండదు. ఎందుకంటే అతడు భగవంతుని నమ్మడు కనుక. ఒకవేళ అతడు నామీద ప్రేమావల్ల నేను చెప్పినవి పాఠించినా అవి అతనికి శాంతిని ఇవ్వలేవు. ఎందుకోతెలుసా అతనికి వాటియందు నమ్మకం లేదు. నమ్మకంలేని చోట భగవంతుడు ఉండడు. అతడు లేకుండా ఎన్నిమంత్రాలు చదివి ఏమిలాభం? కనుక నేను అతనిని కొంతసేపు పాటలు పాడమనో, బొమ్మలు వేయమనో, ఏవైనా ఆహ్లాద కరమైన రచనలు చేయమనో, నాట్యం చేయమనో, ప్రశాంతమైన ప్రకృతిని సరదాగా పలుకరించమనో... ఇలా అతనికి ఇష్టమైనవి ఏమిటో గ్రహించి వాటిలో అప్పటికి ఉపయేగపడే పనిఏదో అది చేయమని చెప్తాను.
ఇక్కడ ఇద్దరి చేతా వేరు వేరు పనులు చేయించాను. కానీ కలిగే ఫలితం మాత్రం ఒకటే. ఒక ప్రశాంతమైన చెరువులో రాయిపడి నప్పుడు నీరు చెదిరినట్లు, ఏదో విషయం వలన కలతపడిన వారు పదే పదే ఆవిషయమును స్మరిస్తూ మరింత చలించిన మనసుతో నావద్దకు వచ్చారు. నేను చేసిందల్లా పూర్వపు సంఘటనను పదే పదే స్మరించకుండా ఉండుటకు వేరొక విషయముపై వారి మనసును ఏకాగ్రపరచుటమాత్రమే. అలా వేరొక విషయం పై మనసు నిలుపుట వల్ల చలించిన వారి మనసు మరల నిశ్చలమైంది. నిశ్చలతలో మనకు తెలియకుండానే ఆనందం లభిస్తుంది.
తిరిగి వారి మనసు కలత చెందదని నమ్మకమేమిటీ అని మీరడగవచ్చు. అవును అది నిజమే మరల కలత చెందే అవకాశం లేకపోలేదు. కనుకనే నేను వారిచేత రోజుకు కొంతసేపు మనసును ఏకాగ్రపరచు ఇటువంటి పనులను చేయిస్తాను. అందువల్ల ఈ పూర్వపు విషయముచేతనే కాక, భవిష్యత్తులో మరే కలతపెట్టు విషయము వల్లనైననూ అంతత్వరగా మనసు చెదురదు. పైగా ఎంతో ఉల్లాసంగా జీవనం సాగుతూ ఉంటుంది. ఆనందం అణువణువున తాండవిస్తుంది.
ఇప్పుడు చెప్పండి నాస్తికులకు, ఆస్తికులకు ఆనందాన్ని పొందేఅవకాశం ఉన్నదా? లేదా? ఉంది కదా!? ఈ ఉదాహరణవల్ల మరో విషయం స్పష్టమవుతున్నది. ఆనందాన్ని పొందుటకు పుజలూ ప్రార్థనలే కాక ఇంకా అనేక మార్గాలు ఉన్నవి అని. ఈ ఉదాహరణ ఇరువర్గాల వారికీ సమ్మతమవ్వ వచ్చు. కానీ ఆస్తికులు మరో ప్రశ్న వేసే అవకాశం ఉంది. ఆనందం పొందటమేనా జీవిత పరమావధీ అని.
అబ్బో ఇది చాలా పెద్ద చర్చ అవ్వవచ్చునేమో!? కనుక మరో టపాలో ప్రయత్నిద్దాము. ఒక్కమాటలో చెప్పాలంటే అవును ఆనందమే జీవిత పరమావధి అని నేను నమ్ముతాను. బ్రహ్మ ఙానం కలిగినప్పుడు ( సత్యం బోధ పడినప్పుడు ) నిశ్చల ఆనందం కలుగుతుంది. నిశ్చల ఆనందం కలిగినప్పుడు జన్మ రాహిత్యం కలుగు తుంది.
ఇటువంటి అనేక భావాల వల్ల " నిజాయితీతో కూడిన " నాస్తిక, ఆస్తిక జనులిద్దరిది సరీయిన పద్ధతే అనినేను నమ్ముతాను. కానీ నేను మాత్రం ఆస్తికతనే పాటిస్తాను. ఎందువల్లనంటే ఇది నా స్వధర్మం. అంతేకాక ఇందు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ముందే ఋషులు నిర్ణయించి ఉంచారు. కనుక ఇక్కడ కొత్తగా కనిపెట్టవలసినది ఏమీ లేదు. వారు చూపిన మార్గంలో నడవడం తప్ప. కానీ నాస్తిక మార్గం అంత సులువుగా పట్టుబడునది కాదు. దానికి ఇవి నియమములని ఎవరూ నిర్ణయించి ఉండక పోవుట వల్ల జనులు తప్పు మార్గము పట్టు అవకాశములెక్కువ. కనుక మార్గ సౌలభ్యము కొరకూ మాత్రమే నేను ఈ ఆస్తిక మార్గమును అనుసరించుచున్నాను.
మీరు నాస్తికులా? ఆస్తికులా?
"భగవంతుడు ఏడి?" అంటూ అతని ఉనికిని ప్రశ్నించడమే నాస్తికత అయితే నేను పరమ నాస్తికుడినే. పూజలు ఎందుకు చేయాలి? భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఈ పూజలు స్వీకరిస్తున్నాడా? ఇలా అనేక రకాల ప్రశ్నలు నాకు వచ్చేవి.
అది ఎలా అంటే... నేను పురోహితుల కుటుంబంలో పుట్టాను. నేను పూజలు చేసినంతకాలం ఇది తప్పా, ఒప్పా అని ఆలోచించలేదు. పెద్ద వాళ్లు చెప్పారు కాబట్టి చేసే వాడిని. కానీ పురోహితుడిగా పూజలు చేయించ వలసిన సమయం వచ్చిన తరువాత నుండీ నాలో యుద్ధం మొదలైంది. నేను ఒకరికి ఇది చేయండీ మంచి జరుగుతుందీ అని చెప్పాలంటే నాకు దానిగురించి ఖచ్చితమైన అవగాహన ఉండాలి.
ఎందుకంటే నేటి కాలంలో ఈ పూజలు, జ్యోతీష్యం, వాస్తు శాస్త్రం మొదలయినవి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వేదమునకు అంత గడ్డు స్థితి ప్రస్థుతానికి లేదుకానీ, జ్యోతీష్యం, వాస్తు శాస్త్రం చాలా వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ నేడో రేపో ఆ ఆటు, పోటులు ఈ పూజా విధానానికీ, వేదాలకూ కూడా రాకపోదు. ఇప్పటికే పురోహితులు పొట్ట నింపుకోవడానికే అనేక రకాల పూజలు చేయిస్తున్నారు అనే మాటలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వినిపిస్తూనే ఉన్నాయి. అలా డబ్బులకోసం చేయాలంటె పురోహితమే చేయనవసరం లేదు అని నా భావన.
ఒకప్పుడు అగ్ర తాంబూలం అందుకొన్న వేదపండితులూ, పురోహితులూ నేడు ఏదో అవసరం కాబట్టి, పెళ్లికీ పేరంటానికీ పిలవక పోతే నలుగురూ నవ్వుతారు కాబట్టి ఆదరించ బడుతున్నారు. నేటి యజమానులే కాదు బ్రాహ్మలూ అలాగే ఉన్నారు. "పూజ చేయించుకునే వాళ్లకు శ్రద్ధ లేనప్పుడు మనకెందుకు కంఠ శోష" అని భావించే పురోహితులే నేటి కాలంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు.
కాని నాకు అది కష్టం. నేను ఏ వృత్తి చేసినా అందులో నాకు తృప్తి ఉండాలి.
అందుకే నేను పురోహితుడిగా పూజచేస్తున్న ప్రతీసారీ నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండే వాడిని.
పూజలు చాలామంది చేస్తున్నారు. కానీ ఎందుకోసం చేస్తున్నారు?
వారాశించిన ఫలితాలు వారికి లభిస్తున్నాయా?
మరి భక్తులు( యజమానులు ) ఆశించిన ఫలితాలు రానప్పుడు, వారికి శుభం చేకూర్చలేనప్పుడూ ఆ పుజలూ, పురోహితులూ వ్యర్ధమే కదా!?
ఒక వేళ లోపాలేమైనా ఉన్నాయా?
ఉంటే ఆ లోపం ఎవరి దగ్గర ఉందీ...?
చేసే భక్తుల వద్దా...?
చేయించే బ్రాహ్మల వద్దా...?
లేదా ఆ భగవంతుడి వద్దా...?
ఆ... "ఆ మంత్రాలకు చింతకాయలు రాలేనా పెట్టేనా..?" "ఎప్పుడో పూర్వ కాలంలో ఏవో అద్భుతాలు జరిగాయని అదే పద్ధతి ఇప్పుడూ పని చేస్తుంది అనుకోవడం తప్పు" అంటూ కొంతమంది పలికే మాటల్లో ఎంతవరకూ నిజం ఉంది?
ఆలోచించగా ఆలోచించగా నాకు కొన్ని విషయాలు అర్థమవుతూ వచ్చాయి.
దేముడు తమ కోరికలు తీరుస్తూ వచ్చినందు వల్ల అతడిని నమ్మే వారు చాలా మంది కనిపిస్తున్నారు.
అలాగే తమ కోరిక తీర్చ లేదని దేముడిని నమ్మడం మానేసిన వారూ ఉన్నారు.
దేముడిని నమ్మని వారిలో ఇంకో రకమూ ఉన్నారు. వాళ్ళకు పొద్దున్నే లేవటమన్నా, నోరు కట్టుకుని ఈ ఉపవాసాలూ మొదలైనవి పాఠించడ మన్నా, నియమముగా ఉండడమన్నా చాలా కష్ట మైన విషయము. అందువల్ల వారు దేముడిపై నాకు నమ్మకము లేదంటూ వాదిస్తూ కాలం గడిపేస్తుంటారు.
ఈ పై 3 రకాలవారూ తమని తాము మోసం చేసుకుంటూ ఇతరులనూ మోసంచేస్తున్నారు.
అలాగే ఇతరులు నొచ్చుకునేటట్లు మాట్లాడటం, ప్రవర్తించడం...., వారిని మభ్య పెట్టో, భయ పెట్టో తమ నమ్మకాలను వారిచే పాటింప చేయడం..., అతి స్వార్థం... మొదలగు అనేక గుణాలు కలిగినవారు ఏ పద్ధతి అవలంబించే వారైనా వ్యర్థమే.
ఆస్తికులైనా, నాస్తికులైనా తమ పద్ధతుల వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా , తమ భావాలు రుద్దకుండా ఉన్నంత వరకూ మాత్రమే సన్మార్గంలో ఉన్నవారవుతారు.
అసలు మనిషి ఏ పనైనా ఎందుకు చేస్తాడు? భోజనం చేయడం, నిద్రపోవడం, ఆటలాడడం, పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం మొదలైన వన్నీ అతనికి ఏమి ఇస్తున్నాయి? సుఖం కోసమా? అయితే ఇది చెప్పండి
కోతమంది తమకు ఎంతమంది పని మనుషులున్నా తమ పిల్లలను తామే స్కూలులో దించి వస్తారు. మరికొందరు తమకు ఎంత ఆస్థి ఉన్నా తాము స్వయంగా సంపాదించడానికే ఇష్టపడతారు.నేటికీ చాలామందికి ముసలి వారైన తమ తల్లి తండ్రులని తమ వద్ద ఉంచుకోవడానికే ఇష్టపడతారు. తమకు తగిన స్థోమత ఉన్నా వృద్ధాశ్రమాలలో చేర్చడానికి చాలా మధన పడతారు. ఎందుకని?
( " మిరింకా ఎక్కడున్నారు? ఇప్పటికే చాలామంది తమ తల్లి తండ్రులని ఆశ్రమాలలో చేర్చేశారు " అని అనుకుంటున్నారు కదూ మనసులో.... :)
అలా చేర్చే వారుకూడ తాము ఆఫీసుకు వెళ్లినప్పుడు ముసలి వారైన తల్లి తండ్రులను చూసే వారు లేరనో, తమ ఇంట్లో కంటే ఆశ్రమం వారి వద్దే సదుపాయాలు ఎక్కువ ఉన్నాయనో మొదలైన అనేక కారణాల వల్ల ఎంతో భాదపడుతూ అలా చేస్తున్నారని నాభావన. )
హాయిగా తిని కూర్చోవడం సుఖంగా ఉంటుంది కదా? మరి అవన్నీ ఎందుకు చేస్తారు?
ఎందుకో తెలుసా ఆనందం కోసం. అంటే సుఖం వేరు, ఆనందం వేరు. సుఖంగా ఉన్న ప్రతీ వారూ ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉన్నవారు సుఖపడుతున్నట్టు కాదు.
ఉద్యోగం చేయవలసిన వయసులో చేయకుండా ఇంట్లో కూర్చుని తినడం సుఖంగా ఉంటుంది. కానీ అలా కొంతకాలం మాత్రమే ఉండగలరు. తరువాతినుండీ యేదో బాధ మొదలవుతుంది.( యేళ్లు గడుస్తున్నా ఇంట్లో వారిపై ఆధారపడుతూ తిని కూర్చునే వారూ నాకు తెలుసు. అలాంటి వారికి వేవేల వందనాలు. ) ఇంట్లో ఉండాలంటే చిరాకు. ఉద్యోగంలో చేరేవరకూ మీ మనసు నిదురకూడా పోనివ్వదు. ఎందుకో తెలుసా అక్కడ సుఖముందేమో కానీ, ఆనందం లేదు.సరిగ్గా అటువంటి ఆనందం కోసమే మనం దేముడిని నమ్మడమైనా, నమ్మక పోవడమైనా. మనం ఆనందంగా ఉన్నంత కాలం, మన వల్ల ఇతరుల ఆనందఆనికి భంగం కలగ నంత కాలం మనం ఏ పద్ధతి పాఠించినా అది సరైనదే.
ఆస్తికత అయినా, నాస్తికత అయినా నిజాయితీ కలిగినదైతే రెండూ మంచివే. రెండు మన శక్తిని పెంచేవే.నిజమైన నాస్తికత్వం ఆస్తికత్వంతో సమానమని పెద్దలంటారు. తర్కం ఉండాలి. కానీ నాదే సరైనది అనే ధృకపథంతో చేసే తర్కం పనికిరాదు. నేను చేసేది తప్పా, ఒప్పా..? ఒకవేళ తప్పయితే ఎందుకు తప్పు? ఒప్పయితే ఎందుకు ఒప్పు? అని ప్రశ్నించుకుంటూ, తనలోని తప్పులను గర్వంలేకుండా ఒప్పుకుని, వాటిని సవరించుకుంటూ చేసే తర్కం సరైనది. అటువంటి తర్కం వల్లనే అనుకుంటా నేను ఆస్తికుడిగా మారాను.
ఇక పూజల వచ్చే లాభనష్టాలు ఏమిటో నేను తెలుసుకున్నది మరో టపాలో వివరంగా చర్చిస్తాను.
No comments:
Post a Comment