Monday, January 07, 2013

ధర్మాధర్మాలు

ధర్మాధర్మాలు

గోపూజలు ఆపండి మహాప్రభో!

పూర్వం ఏ పూజ చేసినా ముందుగా గోపూజ చేసిగానీ మొదలు పెట్టేవారు కాదు. నేడు ప్రతీ పూజలో కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన పూజలలో మనం  కూడా గోపూజ చేస్తున్నాం. కానీ నాటికీ నేటికీ గోపూజలో హస్తిమశకాంతరం ఉంది. పూర్వం గోవులను బట్టే వారి సంపదను లెక్కించేవారు. ప్రతీ వారికీ గోవులు ఉండేవి. ఉదయాన్నే లేచి వాటిని పూజించి మిగతా కృత్యాలు చేసుకోవడం ఆచారంగా ఉండేది.నేడు మనలో నూటికి తొంభైతొమ్మిది మందికి గోవులు లేవు. మనకు ఆ పూజ ఆచారమూ పోయింది. సరే అంతవరకూ బాగానే ఉంది.





 గృహప్రవేశాలప్పుడు ఇంటిలోనికి ముందుగా తాముపెంచుకునే గోవుని పంపి తాము ప్రవేశించడం ఆచారంగాఉండేది. నేటికీ ఆ ఆచారం ఉంది. కాకపోతే నేడు ఆ గోవులు మనవి కావు. ఎక్కడో ఎవరో పెంచుకునే ఆవులను మనం తెప్పించుకుంటాం. ఇక ఆ ఆవు చేత సర్కస్ చేయిస్తాం. పూర్వం ఇళ్లన్నీ మట్టి నేలలతో ఉండేవి. ఇప్పుడు మరి మనవి పాలరాతి నేలలు. చక్కగా నున్నగా పాలిషింగ్ పట్టించి నీళ్లు పడితే జారిపడే విధంగా ఉంటాయి. ఆ నేలమీద మనమే అప్రమత్తంగా ఉంటే జారిపడతాం. అలాంటిది అలవాటు లేని ఆవూ,దూడలను మెట్లు ఎక్కించి, ఆ ఇంట్లో కాళ్లు జారుతూన్నా ఇల్లంతా తిప్పించి, భజంత్రీలు, బంధుగణాలతో నానా గోలా చేసి దానిని భయపెట్టి ఆ భయంతో అది పేడ వేస్తే ఆహా ఇల్లు పవిత్రమైందని భావించి మనం గృహప్రవేశం చేసుకోవడం అవసరమా!?

 దానికంటే చక్కగా ఓ వెండి గోవును పళ్లెంలో పెట్టుకుని లోపలికి ప్రవేశించండి. గోవు చాలా పవిత్రమైనది. దానిని పూజ అనే పేరుతో నేడు మనం నానా హింసలూ పెడుతున్నాం. ఇదంతా తెలిసి చేస్తున్నాం అనికాదు. ఎవరూ ఆలోచించడం లేదు అంటున్నాను. గోవు బాధ పడకుండా ఇంట్లోకి ప్రవేశించాలి అంటే అక్కడివాతావరణం సహజంగా ఉండాలి. కొత్త వాతావరణంలో కొత్తవారిని చూస్తే అవి బెదురుతాయి. పైగా భజంత్రీలు, బంధువులు ఉంటారు. ఇంత మందిని ఒకేసారి చూసి కూడా అవి చాలా భయపడతాయి. ఇక ఆ గ్రానైట్ నేలమీద నడవడం కూడా వాటికి చాలా కష్టంగా ఉంటుంది. కనుక కాస్త ఆలోచించి ఈ ఆచారం నేటికి సరికాదని తెలుసుకోండి. కొంతమంది అపార్ట్ మెంట్లు కూడా ఎక్కించేస్తున్నారు. దయచేసి ఆపని చేయకండి. పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవలసి వస్తుంది. ఒక వేళ పెద్దలు, పురోహితులు ఎవరైనా అదేంటి గోవులేకుండా ఎలా ? అని ప్రశ్నిస్తే ఈ కారణాలన్నీ చెప్పి సున్నితంగా తిరస్కరించండి. నాకు తెలిసి పురోహితులు చాలా మందికి ఈ స్పృహ ఇప్పటికే కలిగింది. యజమానులు కూడా అర్థం చేసుకో గలిగితే గోవును బాధపెట్టిన పాపం తగలకుండా ఉంటుంది.

 ఇక గోపూజను పూర్తిగా వదిలిపెట్టనవసరం లేదు. గృహప్రవేశమప్పుడు దగ్గరలో ఉన్న గోవును పిలిపించండి. కానీ ఇల్లంతా తిప్పే పని మాత్రం మానండి. చక్కగా గోవును పూజించండి. ఈ పూజా క్రమంలో కూడా ఆ గోవు ఒళ్లంతా పసుపు,కుంకుమ చల్లకుండా పాదాలకు, నుదుటివద్ద, తోకకు మాత్రమే కాస్త పసుపు రాసి పూజించండి. మనం కూడా పసుపు మంచిదని ఒళ్లంతా చల్లుకోం కదా!? పాదాలకు రాసుకుంటారు. అలాగే ఆవుకు కూడా.





ఇక ఆవుకు బిడ్డపుట్టేటప్పుడు ప్రదక్షణాలు కూడా దానిని భయపెట్టేవిధంగా ఉంటున్నాయి. కాస్త ఆవిషయంలో కూడా ఆలోచించండి. ఈ మధ్య మరీ మూర్ఖంగా ఆవుకు ఆరుపాదాలు ఉన్నాయి అంటూ వాటిని ఇల్లిల్లూ తిప్పి దానిపేరుతో డబ్బులు దండుకునే వారు తయారయ్యారు. అటువంటి వారిని ప్రోత్సహించకండి. చేతనైతే నాలుగు చివాట్లు పెట్టండి. ఆ ఆవులను పూజ పెరుతో ఒక చిన్న లారీ లాంటి దానిలో పెట్టుకుని తిప్పడం ఎక్కడో చూశాను. రెండు చేతులున్న మనకే లారీలో నుంచుని ప్రయాణించడం కష్టమైన పని. ఆ లారీ దూకుడుకు నుంచోలేక క్రింద కూర్చుంటాం. అలాంటిది చేతులు లేని ఆవులకు ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. దాని ప్రాణం ఎంత హడలిపోయి ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. అలా వాహనాలలొ తిప్పి డబ్బులడిగే వారిని తప్పకుండా ఖండించాలి. కావాలంటే పోలీస్ కంప్లెయింట్ ఇస్తామని బెదిరించాలి.

ఆవుకు ఆరు కాళ్లు ఉంటే చాలా మంచిదని, దానికి పూజించడం చాలా విషేషమని మన నమ్మకం. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. కానీ దానివెనుక కారణాలు ఆలోచించాలి మనం. నోరులేని, మనకంటే నిమ్న స్థాయిలోని ప్రతీ జీవినీ మనం దాదాపుగా పూజిస్తాం. ఆఖరికి కుక్కను కూడా కాల భైరవుడంటూ పూజిస్తాం. అలా ఎందుకంటే వాటికి రక్షణ కల్పించాలని. వాటికి కూడా జీవించే హక్కును కల్పించాలని. మనం భక్తి పేరుతో నైనా వాటిని రక్షిస్తామని. గోవు ఎవరికీ హాని చెయ్యని సాధుజంతువు. పైగా అది తినేది గడ్డి, ఇచ్చేది తియ్యటి పాలు. అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు మూత్రం, పేడ కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ ఈ ఐదింటిని గో పంచకము అంటారు. విషేష పూజలలో వీటిని పూజించి సేవించడం నేటికీ ఉంది. అటువంటి ఆవును రక్షించాలని దానికి పూజలలో ప్రథమ స్థానం ఇచ్చారు. ఏదైనా ప్రయోజనం ఉన్నంత సేపే మనం దానిని రక్షిస్తాం. మన స్వార్థ గుణంతో ఏ ఉపయోగం లేదని, అంగవైకల్యంతో జన్మించిన ఆవులను సంరక్షించడం కష్టమని వాటిని ఎక్కడ వదిలేస్తామో అన్న చింతనతో అటువంటి వాటిని విషేషంగా పూజించాలన్న నియమం పెట్టి ఉండవచ్చు. అలాంటిది వాటిని పూజపేరుతో ఊరూరూ తిప్పుతూ మరింత బాధ పెట్టడం చాలావిచారకరం. అందరూ ఈ విధానాలను ఖండించాలి.

 గోవులను బాధపెట్టకుండా పూజించే వీలులేకపోతే ఆ పూజలు మానండి. నష్టమేమీ లేదు. వాటిని తెలిసికానీ తెలియక కానీ ఏవిధంగానూ బాధ పెట్టడం మంచిదికాదు.

మాంసాహారం తినడం అధర్మమా?

నేడు శాకాహారులు మాంసాహారులు అవుతున్నారు. మాంసాహారులు అనారోగ్యం పేరుతో శాకాహారులవుతున్నారు.

శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా మరుతోంది. ఎక్కడ చూసినా మాంసాహార శాలలే కనిపిస్తున్నాయి. కాలేజీ ర్యాగింగులలో శాకాహారి అనేవాడు కనబడితే వాడు మాంసం ముట్టేదాకా వెధిస్తారు. ( ఈ స్థితి ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు మందు, సిగరెట్, అమ్మాయిలు ఈ విషయాలలో సీనియర్స్ జూనియర్స్ కి వద్దుమొర్రో అన్నా నెర్పిస్తున్నారు. ) మనసులో శాకాహరిగా ఉందామని ఉన్నా చుట్టూ ఉన్న అనేక పరిస్థుతుల వల్లో, చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది మాంసాహారులే ఉండడం వల్లో, జిహ్వ చాపల్యం వల్లో, ప్రలోభం వల్లో నేడు శాకాహారులందరూ మాంసాహారులవుతున్నారు. గుడ్డు మాంసాహారం కాదని దానిని శాకాహారంలో కలిపెసిన వారూ ఉన్నారు.

ఇటువంటి సందర్భంలో శాకాహారిగా జీవించడం ప్రశ్నార్థకమవుతున్నది.అసలు ఇంత కష్ట పడి శకాహారిగా జీవించడం అవసరమా? అసలెందుకు శాకా హారిగా జీవించాలి? మాంసాహారం తింటే ఏమిటి నష్టం? ఇలా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అలాగే మాంసాహారులు కూడా శాకాహారుల ప్రభావంతో ఆలోచనలో పడుతున్నారు. మాంసాహారులుగా ఉండడం మంచిదా? శాకాహారులుగా ఉండడం మంచిదా? అనే ప్రశ్నలు ఏదో ఒక సందర్భంలో రాకమానవు. మాంసాహారం మానలేక శాకాహారానికి రాలేక తాముచేసేది తప్పు అనే ఉద్దేశంలో సతమత మయ్యే వారూ ఉండవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో శాకాహారులకు, మాంసాహారులకు అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏది మంచి, ఏది చెడు అని. ఇదే విషయం నేనాలోచిస్తే ఏది ధర్మం, ఏది అధర్మం అని ఆలోచిస్తాను. రెండిటికీ తేడా ఏమిటీ? అనుకోకండి. చాలా తేడా ఉంది. మొదటి రకంగా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు ఈ ధర్మాధర్మ విచక్షణ ద్వారా చాలా సులభంగా దొరుకుతుంది.

నాకో సందేహం ఈ శాకాహరం అనేది మనమే పాటిస్తున్నామా? మొదటి నుడీ శాకాహారాన్నే నియమంగా పెట్టుకుని ఉన్న శాఖలు/తెగలు ఇతర దేశాలలో ఏమైనా ఉన్నాయా?

ఇక మన విషయానికి వస్తే ఆహారం కోసం ఒక దానిపై మరికటి ఆధార పడడం ప్రకృతి ధర్మం. ఆహారం కోసం చెట్లపై ఆధారపడడం ఎంత సహజమో, జంతువులపై ఆధారపడడమూ అంతే సహజం. పూర్వ కాలంలో అందరూ మాంసాహారం తినేవారని పూరాణేతిహాసాల వలన తెలుస్తోంది. వశిష్టుడు మొదలైన వారికి శ్రాద్ధాది క్రతువులలో మధువు, మాంసాహారం ( మేక మాంసం ) పెట్టేవారు. సోమయాగంలో( ఆ సోమయాగం చేసినవారిని మత్రమే సోమయజి అనే వారు. ఇప్పుడు అందరూ అపేరు పెట్టుకుంటున్నారు. ) ఆ విధంగా చూస్తే మాంసాహారం తినడం అధర్మమేమీ కాదు.

అయితే మాంసాహరం తినవచ్చా? అంటే తినవచ్చు. మరి కొందరు ఎందుకు నిషద్ధం చేశారు?
ఇదే అందరూ ఆలొచించ వలసిన విషయం. మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు అని ప్రశ్నించుకుంటే ఆ మాంసాహారాన్ని తినడం వలన రజో గుణం ఎక్కువ అవుతుంది. ( ఇదే కారణంతో కలియుగంలో బాహ్మలు, గురువులు మధుమాంసాలు తినరాదని శుక్రాచార్యుడు శపించాడు. ) శాకాహారం సాత్విక లక్షణాలు పెరుగుతాయి. ఈ రజోగుణం మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత చేటు. సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి ఙ్ఞానం వైపు నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.

అంటే మాంసం తినేవారికి ఈ సాత్విక గుణం లేదనా? ఎందుకు ఉండదు? తప్పక ఉంటుంది. కానీ దాని పాళ్ల ( levels ) లో తేడా ఉంటుంది. అలాగే శాకాహారం తినే వారిలో పూర్తిగా సాత్విక గుణాలు ఉంటాయనుకోవడం కూడా అపోహే అవుతుంది. ఎందుకంటే వారు రజోగుణానికి ఇతర కారకాలైన మద్యము, గుట్కా, జరదా, గంజాయి, ఉల్లిపాయలు ఇంకా అనేకమైనవి సేవిస్తూ ఉండవచ్చు. కనుక ఈ రజోగుణం ఎక్కువగా కలగకుండా ఉండటం కోసం మాత్రమే ఇటువంటివి మానేయవలసిన అవసరం ఉంది.

బ్రాహ్మలు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండే వారు. నలుగురికీ ఙ్ఞాన మార్గం బోధించ వలెను కనుక వారికి ఇటువంటివి నిషేధించడమైనది. అందువలన వారు ఎక్కువ సాత్విక ప్రవృత్తి ( positive attitude ) కలిగి ఉండి ఙ్ఞానాన్వేషకులై జీవించేవారు. ఇప్పటికీ సాత్వికాహారం తినేవారు చాలా మంచి గుణాలు కలిగి ఉండడం మీరు గమనించ వచ్చు.

ఇది నా దృష్టి కోణం మాత్రమే. ఇంకా చాలా విషయాలు వ్యాఖ్యల రూపంలో వస్తాయి. అవన్నీ చదివి ఏది సమంజసమో మీరే నిర్ణయించుకోండి.

మూఢనమ్మకాలు

రహమతుల్లా గారు నా ఆస్తిక-నాస్తిక వాదన అనే టపాకు వ్యాఖ్యగా మూఢనమ్మకాలపై మంచి విషయాలు ప్రస్థావించారు. అక్కడ వెంటనే ప్రచురింప బడక పోవడం వల్లననుకుంటా నా క్రితం టపా కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా? అనే టపాలో కూడా వ్యాఖ్యగా రాశారు.

ఇక వారు ప్రస్థావించిన అన్ని విషయాలనూ నాకు నేను ప్రశ్నించుకుంటే వాటికి ఏ సమాధానాలు ఇచ్చుకుంటానో వాటిని ఇక్కడ తెలియజేస్తాను. అవి చాలా మందికి కలిగే సందేహాలు కనుక ఈ టపా అందరికీ ఉపయోగ పడవచ్చు.

ఇక వరుసగా ఆ విషయాలు ( ప్రశ్నలు )చూద్దాం.


1* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు, ఇదొక మానసిక దివాళాతనం

ఈ విషయంలో నేను ప్రత్యక్షంగా చూస్తేకానీ ఏమీ స్పందించలేను. ఎందుకంటే ఇక్కడ ఒకరి ఎంగిలి ఒకరు ఎంతో మక్కువతో తింటున్న ప్రజలను చూస్తున్నాను. హోటళ్లలో అయితే అది శాఖాహారమా, మాంసాహారమా అని కూడా ఆలోచించటం లెదెవరూ. చక్కగా చికెన్ తో ఏదో వేపుడు చేసిన మూకుడు లోనే, నూడుల్స్ వేయిస్తాడు. జనాలు అవి ఆవురావురుమని తింటున్నారు . దీనిని చూసిన నాకు అదేమీ అంత పెద్ద పైత్యమనిపించడంలేదు. కానీ ప్రత్యక్షంగా చూస్తే మరోలా అనిపించవచ్చునేమో.

2* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఇది ఆచరించవలసిన విధానమే. దేవాలయం అంత విశాల ప్రాంగణంలో కట్టాలి అని తెలియజేయడానికి ఇది సంకేతం. మన ఇల్లు కట్టినట్టు చిన్న చిన్న స్థలాలలో దేవాలయాలు కట్టకూడదు. వంటిల్లు, హాలు ఒకేలా కట్టము కదా? అలగే దేవాలయాన్ని ఎలా నిర్మించాలి అనే విషయంలో కొన్ని విధనాలు పాఠించాలి మనం.

3* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.

ఇది నిజంగా మూఢనమ్మకమే. ఇది తప్పక ఖండించాలి.

4* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.

ఇది నేను ఇదివరకు వినలేదు. గ్రామ వాతావరణంలో అది సబబేనేమో.. ఆ జాతరలు జరిగే రోజులు అంటు వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో వస్తాయా? అలా అయితే అది సమంజసమే కదా? శుభకార్యాల పేరుతో జనాలు ఎక్కువగా ఒక్కచోట చేరటం వల్ల అవి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా? పూర్వం గ్రామాల్లో నే కాదు పట్టణాల్లో కూడా ఈ వ్యాధులకు ఎంతో మంది బలైపోయేవారు. అందుకే అటువంటి నమ్మకం ఏర్పరచుకుని ఉంటారు. అది మంచిదే అనిపిస్తోంది.


5* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.

అవునా? నాకు ఈ విషయం తెలియదు. ఏదీ సరిగా తెలియకుండా వ్యాఖ్యానించడం అంత సబబుకాదు. అందుకే నేనేమీ చెప్పలేను.

6* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

ఇది దారుణం. చేత బడుల గురించి వినడమే గానీ , నిజంగా చూడలేదు.అయితే చేతబడులు లేవని నేను నమ్మలేను. అది ఒక హిప్నాటిజం లాంటిది.పూజలు అనేవి మానసిక బలాన్ని పెంచగలవని నమ్ముతాను.అలాగే చేతబడులు మానసికంగా కృశింపచేయడానికి ఉపయోగ పడతాయేమో అనుకుంటున్నాను. కానీ నేడు అంత దీక్షగా చేయగలిగే వారెంతమందీ అన్నదే సందేహం.

7* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.

ఇది ఖచ్చితంగా మూఢనమ్మకం. ఆ పూజారి ప్రజల బలహీనతలతో బ్రతుకుతున్నాడని చెప్పగలను.


8* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఆ సమయంలో ప్రకృతి శక్తులు అంతగా పనిచెయ్యవు. ఆకాశంలో జరిగే క్రియలు మన దేహంపై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నది నేను నమ్ముతాను. చంద్రుడి వెన్నెల మనసుకు ఎలా ఆనందాన్నిస్తుందో, సూర్యుడి వేడి దేహానికి తాపాన్ని ఎలా కలుగజేస్తున్నదో అలాగే ఆ గ్రహణ సమయంలో కూడా మన దేహం ( ఈ ప్రకృతి మొత్తం ) దాని ప్రభావానికి లోనవుతుంది. వేసవి కాలంలో పల్చని వస్త్రాలు ధరించాలి. సీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరించాలి. అలా అని అది నియమం కాదు. ధరించక పోతే ఏమౌతుంది? ఆ బాధను భరించవలసి ఉంటుంది. అలాగే ఈ గ్రహణ సమయంలో భోజనాదులు కూడా నిషిద్ధం. అలా చేయటం చేయక పోవడం వారి వారి నమ్మకం మీద ఉంటుంది.

అన్నీ కంటికి కనపడవు. కొన్ని కంటికి కనిపిస్తే , కొన్ని బుద్ధికి తడతాయి మరి కొన్ని మనసుకు గోచరిస్తాయి. వేటి కీ అందక పోయినా అవి అసత్యాలని కాదు. ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలియాలంటే నిరంతర వినయంతో కూడిన, తప్పును సరిదిద్దుకోగలిగిన వివేచన మాత్రమే మనకు దారి.

9* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.

ఇక కొన్ని ఇలాంటి నమ్మకాలు కొంత సత్యానికి , కొంత కల్పన చేర్చి మరింత చేసి మసి పూసి మారేడు కాయ చేసినవన్నమాట. నాకు సరిగ్గా తెలియదు కానీ తుమ్మగానే మనలో రక్త ప్రసరణ స్తంభించడం, గుండె ఆగడం వంటివేవో అనేక మార్పులు జరుగుతాయట. ఇది సైంటిఫిక్ రీజన్. అందు వలన ఓ క్షణం ఆగి ఏ పనైనా ప్రారంభించమనడం వరకూ నేను ఆచరిస్తాను. ఇక మన తప్పును ఎవరి తుమ్ముపైనో రుద్ధడం అనేది చేతకాని తనం.

10* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.

కన్యా దానం అనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది కానీ, ఇలా కాదు సరైన వరునికి దానమివ్వమని చెప్పారు. తద్వారా వారికి సంతానం కలిగి వంశ అభివృద్ధి జరుగుతుంది. ఆ పుట్టిన వారు పితృకర్మలు చేస్తే వీరికి పుణ్యగతులు కలుగుతాయి. అందుకోసం కన్యాదానం చెయ్యమన్నారు. కానీ అది ఇలా వదిలించుకోవడంగా రూపుమారడం శోచనీయం.

11* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.

ఆవుకు మనిషి పుట్టడం నిజంగా జరిగిందా? ఒక వేళ జరిగితే దీపాలు వెలిగించడం అనేది ఓవిధంగా మంచిదే. ఈ విషయం వల్ల నిరూపణవుతున్నదేమిటీ----? మనిషికి కామం మితిమీరిందన్నది తెలుస్తున్నదికదా? ఆ కామాన్ని అదుపులో పెట్టు నాయనా అని ఎవరికి చెప్పాలి. అందరూ పశుప్రవృత్తినుండి, మానవ ప్రవృత్తికి రావాలి ( మనలో చాలా వరకూ పశు ప్రవృత్తి ప్రబలుతోంది అన్నది అందరూ అంగీకరించని నిజం ). అలా రావాలంటే ఈ పూజలూ మొదలైనవి చాలా సహాయపడతాయి. పైగా ఇవి లోకక్షేమంకోరి చేస్తున్నామంటే మరింత త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువ. ( తను బాగుపడడానికి ఎంతో బద్ధకించే వాళ్లు ఎంత ఎక్కువ మంది ఉన్నారో..., లోక కళ్యాణం కోసం అనగానే అందరికంటే శ్రద్ధగా చేసేవాళ్లు అంతకంటే ఎక్కువమంది నేడు ఉన్నారన్నది కూడా పచ్చి నిజం . అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను పూజలు చేయించే చోట్ల చాలా మందికి చెప్తాను. మీరు ఇలా రోజూ దీపారాదనచెయ్యండి, మీకు శుభం కలుగుతుంది అంటే వినేవాళ్లు తక్కువే. కానీ నేను లోక క్షేమంకోరి ఓ యాగం చేస్తున్నాను. మీరు వచ్చి తప్పక పాల్గొనాలి అని పిలిచినదే తడవు నాకు అనేక విధాలు సాయపడ్డవారు చాలామంది ఉన్నారు. ) ఈ విధంగా ఆలోచిస్తే ఈ దీపాలు వెలిగించడం అనేది అనాలోచితమైన పని కాదు. ఎంతో ఆలోచించి ఓ మహాను భావుడెవరో ప్రవేశపెట్టిన ఓ పథకం.

ఈ పని ఇలా జరగడమే ఉత్తమం కూడా. మన నేతలలో ఎవరో చాలా పెద్ద కుంభకోణాలలో ఉన్నారనుకోండి. అది ప్రత్యక్షంగావెలుగు చూపితే వచ్చే మంచి కంటే చెడే ఎక్కువ. లోపల వారిని శిక్షించి పైకి మరొ విధమైన రూల్ ని పాస్ చెయ్యడమే తెలివైన ప్రభుత్వం చేసే పని. తద్వారా ప్రజలకు అభద్రతా భావం ఏర్పడకుండా ఉంటుంది. అటువంటిదే ఈ పని కూడా.


12* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

వాటి ప్రాశస్త్యం ఏమిటో నాకైతే తెలియదు. ఇలాంటివి గ్రామాలలో ఇంతలా ఎలా పెరుగుతున్నాయో ఓసారి ఆలోచించాలి. కోరికలు పెరగడమే ఈ నమ్మకాలు పరాకాష్టకు రావడానికి కారణంగా తోస్తోంది. ఏదైనా అతి పనికి రాదు.

13* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.[1]

ఇది ఓ పిచ్చి లాంటిదే. ఆ డబ్బును బీదప్రజలకు దానంగా ఇస్తే ఎన్ని కుటుంబాలకు తిండీ గుడ్డా అందుతాయో కదా..? :(

14* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm


ఇటువంటి వ్యక్తులను ఎలానమ్ముతారో ప్రజలు. ఇటువంటి దొంగ బాబాలను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి ప్రభుత్వం.


15* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.

కేరళ జ్యోతీష్యాన్ని గురించిన పూర్తి వివరాలు నాకు తెలియదు. నా వరకూ జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది మనం కష్టంలో ఉన్నప్పుడు చుక్కానిలా పనిచేస్తుంది. ఏదారీ తోచని వారికి ఓ వెలుగు బాట చూపుతుంది. కానీ ఎల్లప్పుడూ ఆ జ్యోతీష్యం అవసరం లేదు. మీరు ఎవరూ తీర్చలేని కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఆధారపడండి అని అందరికీ చెప్తుంటాను.


16* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.

వీటి విషయంలో కూడా ఉన్నదానికంటే ఎక్కువ ప్రచారం జరిగింది. దీనికి ముఖ్యకారకులు రాళ్ల వ్యాపారులు. జ్యోతీష్యులను పావులుగా చేసి జనాల బలహీనతలతో ఆటలాడారు/ఆడుతున్నారు.

జనాలు కూడా అమాయకులై ధరించడం లేదు. నేను ఇన్ని వేల రత్నాన్ని ధరించాను అని చెప్పుకోవడం ఓ గౌరవం, ఓ దర్జా అయిపోయిందిప్పుడు. నేను ఎవ్వరికీ రాళ్లు పెట్టుకోమని చెప్పను. ఒకవేళ పెట్టు కుంటమన్నా దానికి వేలకు వేలు ఖర్చుపెట్టవద్దు అని ఖచ్చితమైన సలహా ఇస్తాను. దానికంటే రోజూ ఇంట్లో దీపారాధన చెయ్యడం వెయ్యిరెట్లు మంచిది. కానీ జనాలకు శ్రమలేకుండా, పనయ్యే మార్గం కావాలి. దానికి ఎంతైనా ఖర్చుపెడుతున్నారు.

17* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట

చీము,నెత్తురుతో జుగుప్సాకరంగా ఉండే వైతరిణీ నదిని దాటవలెనంటే గోదానం చెయ్యాలి. ఆ గోదాన మహిమ వల్ల దానిని దాటగల శక్తి వస్తుంది.

గోదానానికే ఎందుకంత ప్రశస్తి కలిగింది? అంటే దీనికే కాదు (పైన 10 లో చెప్పినట్టు) ఇంకా అనేక దానాలకు కూడా చాలా గొప్పదనం కలదని చెప్పారు మన పెద్దలు. ఇక్కడ ముందు ఆలోచించ వలసింది గోదానం గొప్పేమిటని కాదు. దానం గొప్పేమిటని?

పూర్వం ధనాన్ని గోవులతో కొలిచే వారు. అంటే అతనికి ఎంత గోసంపద ఉంటే అంత ధనవంతుడన్నమాట. అలాగే ఈ గోపోషణ అనేది పరమ ఉత్తమమైన పనిగా ఎంచబడేది. అలాగే ఈ వైతరిణీ నది అంటే మరేదో కాదు మన జీవితమే అనేక పాపాలతో కూడుకున్న జుగుప్సాకరమైన వైతరిణీ నదికి సంకేతం. ఈ విధంగా పోల్చుకుంటే

మన జీవితాన్ని సునాయాసంగా దాటడానికి దానం అనేది పరమ సాధనంగా ఉపయోగ పడుతుంది. అంటే మనం సంపాదించినది పరోపకారార్థం ఏకోరికాలేకుండా దానం చేయగలిగిన నాడు ఆ జీవితం సుఖదుఃఖాలకు అతీతంగా ఆనందడోలికల్లో తేలిపోతుంది.

హిందూ సాంప్రదాయంలో ( హిందూ అనే కాదు చాలా సాంప్రదాయాలలో ) ఉన్న నిగూఢార్థం అర్థమవ్వాలంటే ఎంతో తపన ఉండాలి. సత్యమునే పలకండి అని అన్ని మతాలు చెప్తున్నాయి. ఆసత్యాన్నే ఎందుకు పలకాలి ? అలా పలికితే మనకు మంచి ఎలా జరుగుతుంది? పలకక పోతే పాపమెలా కలుగుతుంది? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుంటే దాని పూర్వాపరాలు తెలుస్తాయి. దీనికి చక్కని ఉదాహరణ మన చిన్నప్పుడు చదివిన " నాన్నా పులి" అనే గొర్రెలు కాచే పిల్లవాడి కథ . ఇలాంటి అనేక కథల ప్రభావమో, జీవితానుభవమో మొత్తానికి సత్యాచరణం మంచిదని ఒప్పుకోవడానికి చాలా మందికి అభ్యంతరమేమీ లేదు. కానీ ఇలాంటి కొన్ని ధర్మాలను ఒప్పుకోవడానికి అనేక సంశయాలు వేధిస్తుంటాయి. దానికి వినయంతో కూడిన అన్వేషణే మార్గం.


మన బుద్ధికి,ఊహకు అందని / సమంజసమనిపించని చాలా విషయాలను మనం ముఢనమ్మకాలుగా చెప్తాం. కానీ మనకు తెలిసినవే సమగ్రమైనవి, సరిఅయినవి అనే అభిప్రాయం సరి కాదు. నాకు లేదు. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. మీకు నచ్చితే మరికాస్త ఆలోచించండి. లేదంటే మరల ప్రశ్నించండి. :)
 

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి



ముందుగా
కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము
( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.


అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను. 

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
  నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా
- వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.


అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.
 


No comments:

Post a Comment